|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 08:11 PM
భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు తమ విభేదాలను పరిష్కరించుకునేందుకు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని రష్యా సూచించింది. ఇదివరకే అమెరికా, చైనా వంటి దేశాలు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, తాజాగా రష్యా కూడా ఈ జాబితాలో చేరింది.ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తాము ఆశిస్తున్నట్లు రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. "భారత్, పాకిస్థాన్ ప్రత్యక్షంగా శాంతి ఒప్పంద చర్చలు జరపాలి. ఈ విషయంలో ఇరు దేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం" అని పేర్కొన్నారు.గతంలో 'ఆపరేషన్ సిందూర్' అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతుండటాన్ని అమెరికా స్వాగతించింది. ఇరు దేశాల మధ్య సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి మార్గాన్ని అనుసరించడాన్ని అభినందిస్తున్నామని అమెరికా అధికారులు వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోలు కూడా ఆకాంక్షించారు.మరోవైపు, భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించిన చైనా కూడా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణను సమర్థించింది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించింది.
Latest News