|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 07:46 PM
ఆపరేషన్ సిందూర్.. ఈ పేరు వింటే ప్రతి భారతీయుడి రోమాలు గర్వంతో నిక్కబొడుకుంటాయి. కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లిన అమాయకులను లక్ష్యంగా చేసుకుని.. పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి సుమారు 25మందికి పైగా పర్యాటకుల ప్రాణాలు తీశారు. ఇందుకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది.
భారత్ దాడులకు ప్రతీగా పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వింది. ఇండియాపై దాడికి యత్నించింది. కానీ భారత్ అమ్ములపొదిలోని అస్త్రశస్త్రాలు.. దాయాది దాడులను తిప్పి కొట్టాయి. పాకిస్థాన్‌లోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. భారత్ చర్యలతో పాక్ తోక ముడిచింది. బాబోయ్ వదిలేయండి అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి.
భారత్ సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక యువత సైతం ఆపరేషన్ సిందూర్ గొప్పతనాన్ని చాటేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆపరేషన్ సిందూర్, వాయుసేనకు సంబంధించిన ఫొటోలు ముద్రించిన టీషర్ట్స్‌ని ధరించి.. గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సైన్యానికి, భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు.
కేవలం ఫొటోలు మాత్రమే కాక.. నినాదాలు, భారత వాయుసేనకు సంబంధించిన ఫైటర్ జెట్ ఫొటోలను ముద్రించిన టీషర్ట్స్‌తో యువతను ఆకట్టుకుంటున్నాయి పలు కంపెనీలు. ‘లక్ష్యాలను ఛేదించడమే మా పని.. శవాల మూటలు ఎన్నో లెక్కజెప్పడం కాదు..’, ‘కినారా హిల్స్‌లో ఏముందో మాకు తెలియదు. తెలిసిందల్లా పని చేసుకుంటూ పోవడమే’లాంటి నినాదాలు ఉన్న టీషర్ట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పలు కంపెనీల ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. దేశ భక్తిని చాటేలా.. మన సైనిక శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా టీషర్ట్స్ డిజైన్ చేస్తున్నారు.పైగా వీటిని అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ధరించేలా డిజైన్ చేయడంతో.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. యువత వీటిని ధరించి.. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. మరీ మీరు కూడా వీటిని కొనగోలు చేసి.. కొత్త ట్రెండ్‌ను ఫాలో అవ్వండి.
Latest News