|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 07:13 PM
బెంగళూరు నగరంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సిగరెట్ విషయమై తలెత్తిన చిన్న గొడవ చివరికి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ అమానవీయ సంఘటన కనకపుర రోడ్డులోని వసంతపుర క్రాస్ సమీపంలో మే 10వ తేదీ తెల్లవారుజామున జరిగింది. మృతుడిని వజరహళ్ళికి చెందిన హెచ్.ఎన్. సంజయ్ (29)గా పోలీసులు గుర్తించారు.పోలీసుల కథనం ప్రకారం, సంజయ్ తన సహోద్యోగి చేతన్ (30)తో కలిసి సుబ్రమణ్యపుర ప్రాంతంలోని ఒక దుకాణం వద్ద సిగరెట్ తాగుతున్నారు. అదే సమయంలో ప్రతీక్ అనే వ్యక్తి తన ఎస్‌యూవీ వాహనంలో అక్కడికి వచ్చాడు. దగ్గరలోని దుకాణం నుంచి తనకు ఒక సిగరెట్ తీసుకురమ్మని సంజయ్‌ను కోరాడు. ఇందుకు సంజయ్ నిరాకరించడమే కాకుండా, ఆ వ్యక్తిని మందలించినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం, ఈ క్రమంలో ప్రతీక్సంజయ్‌పై భౌతికంగా దాడి చేశాడని తెలిసింది.ఆ తర్వాత, సంజయ్, చేతన్ ఇద్దరూ తమ మోటార్‌సైకిల్‌పై అక్కడి నుంచి బయలుదేరారు. అయితే, వారిని వెంబడించిన ప్రతీక్, తన ఎస్‌యూవీతో వెనుక నుంచి వారి బైక్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడని ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో బైక్ పైనుంచి కిందపడిన సంజయ్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన చేతన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సంఘటనపై చేతన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే, సంజయ్ మరణంతో దీనిని హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, ఘటన జరిగిన తీరును గుర్తించి, నిందితుడు ప్రతీక్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Latest News