|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 06:32 AM
పాకిస్థాన్ శాంతిని కోరుకునే దేశమే అయినప్పటికీ, ఆత్మరక్షణ కోసం తగిన రీతిలో బదులిచ్చే హక్కు తమకుందని ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శుక్రవారం స్పష్టం చేశారు. దేశ సైనిక దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన 'యౌమ్-ఎ-తషక్కర్' కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో భారత్, పాకిస్థాన్ మధ్య నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్లు, క్షిపణులతో దాడులు ప్రతిదాడులు జరిగిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.'యౌమ్-ఎ-తషక్కర్' దినోత్సవం ఇస్లామాబాద్‌లో 31 తుపాకుల వందనంతో, ఇతర ప్రావిన్షియల్ రాజధానుల్లో 21 తుపాకుల వందనంతో ప్రారంభమైందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో పాకిస్థాన్ తెలిపింది. సాయుధ దళాలకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు. ఇస్లామాబాద్‌లోని ప్రధానమంత్రి నివాసంలో షెహబాజ్ షరీఫ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సాయుధ దళాలు ఇటీవలి ఘర్షణల్లో సమర్థవంతంగా, దీటుగా స్పందించాయని, దేశ సైనిక చరిత్రలో అదొక సువర్ణాధ్యాయం అని ప్రశంసించారు.అనంతరం, ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇటీవల భారత దాడుల్లో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఇంటికి వెళ్లారు. ఆయన వెంట రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ కూడా ఉన్నారు. ఉస్మాన్ యూసఫ్ కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మృతిచెందిన అధికారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ తర్వాత రావల్పిండిలోని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రిని సందర్శించి, దాడుల్లో గాయపడిన సైనికులు, పౌరుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Latest News