![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 16, 2025, 06:37 AM
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడాకారుడిగా నిలిచాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసిన 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల జాబితాలో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. గత ఏడాది కాలంలో రొనాల్డో ఏకంగా 275 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు 2295 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు ఫోర్బ్స్ తన నివేదికలో వెల్లడించింది. ఇది ఫోర్బ్స్ చరిత్రలోనే ఒక క్రీడాకారుడు ఆర్జించిన మూడో అత్యధిక వార్షిక మొత్తం కావడం గమనార్హం.సౌదీ ప్రో లీగ్‌లో అల్ నాసర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా రొనాల్డోకు భారీ ఆదాయం లభించింది.. ఇటాలియన్ క్లబ్ జువెంటస్ నుంచి అల్ నాసర్‌కు మారిన తర్వాత, అతడి వార్షిక వేతనం 200 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. మైదానంలో ఆటతో పాటు, మైదానం వెలుపల కూడా రొనాల్డో వాణిజ్యపరంగా దూసుకుపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్ఠాత్మక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించడం, తన సొంత CR7 బ్రాండ్ పేరుతో హోటళ్లు, పెర్ఫ్యూమ్‌లు, జిమ్‌లు వంటి వ్యాపారాల ద్వారా కూడా రొనాల్డోపై కాసుల వర్షం కురుస్తోంది. ఈ జాబితాలో రొనాల్డో దరిదాపుల్లో కూడా ఇతర క్రీడాకారులు లేకపోవడం అతడి వాణిజ్య శక్తిని స్పష్టం చేస్తోంది. బాస్కెట్‌బాల్ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ 133.8 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచాడు. ఇది రొనాల్డో సంపాదనలో సగాని కన్నా తక్కువ కావడం గమనార్హం. సినిమాలు, క్రీడా జట్ల కొనుగోలు వంటి వ్యాపారాల్లో లెబ్రాన్ జేమ్స్ తన ఆసక్తిని పెంచుకుంటున్నప్పటికీ, రొనాల్డో రికార్డు స్థాయి ఆదాయానికి చాలా దూరంలోనే ఉన్నాడు.ఫోర్బ్స్ టాప్ 50 అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకోవడానికి కూడా ప్రమాణాలు ఏటికేడు పెరుగుతున్నాయి. 2025 జాబితాలో చివరి స్థానంలో నిలిచిన క్రీడాకారుడి వార్షిక ఆదాయం 53.6 మిలియన్ డాలర్లు కాగా, ఇది 2024లో 45.2 మిలియన్ డాలర్లుగా, 2017లో కేవలం 27.2 మిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. 40 ఏళ్ల వయసులోనూ క్రిస్టియానో రొనాల్డో ఆర్థికంగా ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం అతడి అసాధారణ ప్రతిభకు, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య ఆకర్షణకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సౌదీ అరేబియాకు మారడం అతడి కెరీర్‌కు కొత్త ఊపునివ్వడమే కాకుండా, కొత్త మార్కెట్లు, ప్రేక్షకులకు చేరువ చేసి, ఆయన వాణిజ్య విలువను మరింత పెంచిందని వారు అభిప్రాయపడుతున్నారు.ఐదుసార్లు బాలన్ డి'ఓర్ పురస్కార గ్రహీత అయిన క్రిస్టియానో రొనాల్డో, కేవలం ఫుట్‌బాల్ ఆటగాడిగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన ఒక వాణిజ్య శక్తిగా అవతరించాడని ఫోర్బ్స్ తాజా జాబితా మరోసారి ధృవీకరించింది.
Latest News