![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 16, 2025, 06:26 AM
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మధ్య మైదానంలోనే కాకుండా వెలుపల కూడా మంచి స్నేహబంధం ఉంది. అయితే, ఈ బంధం తొలినాళ్లలో పూర్తి భిన్నంగా ఉండేదని డివిలియర్స్ తాజాగా వెల్లడించాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కోహ్లీలోని తీవ్రమైన పోటీతత్వం కారణంగా అతనంటే తనకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదని, కానీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సహచరులయ్యాక తమ మధ్య బంధం గాఢ స్నేహంగా మారిందని డివిలియర్స్ తెలిపాడు.ఈ విషయంపై డివిలియర్స్ మాట్లాడుతూ, "విరాట్ నా క్రికెట్ సోదరులలో ఒకడు. అతడిని దగ్గరగా తెలుసుకున్నాక నేను అతడిని ఎంతగానో ఇష్టపడటం మొదలుపెట్టాను. ప్రత్యర్థిగా ఆడినప్పుడు అతను చాలా చికాకు తెప్పించేవాడు. అందుకే అతడిని సరిగ్గా తెలుసుకోకముందు నాకు అతను పెద్దగా నచ్చేవాడు కాదు. ఎందుకంటే అతను చాలా గొప్ప ఆటగాడు, తీవ్రమైన పోటీతత్వం కలిగినవాడు. ఈ విషయంలో దాదాపు నాలాగే ఉండేవాడు" అని వివరించాడు.తమ మధ్య ఉన్న పోటీతత్వం గురించి మరింత వివరిస్తూ, "మేమిద్దరం గెలవడానికి ఎక్కువగా ఇష్టపడతాం. జట్టులో మా వంతు కీలక పాత్ర పోషించాలని చూస్తాం. దీనికి ఏదైనా ఆటంకం కలిగితే, బాడీ లాంగ్వేజ్ దూకుడుగా మారిపోతుంది. ఎదురుదాడి చేసేలా చేస్తుంది. ప్రత్యర్థిగా కోహ్లీ కూడా సరిగ్గా అలాగే ఉండేవాడు" అని డివిలియర్స్ పేర్కొన్నాడు.అయితే, ఆర్‌సీబీలో తామిద్దరం కలిశాక పరిస్థితి మారిపోయిందని తెలిపారు. "ఆ తర్వాత ఆర్‌సీబీలో అతడి గురించి మరింత బాగా తెలిసింది. మేం కుటుంబ స్నేహితులయ్యాం, సోదరుల్లా మారాం. వికెట్ల మధ్య గొప్ప భాగస్వాములం అయ్యాం. మైదానంలో ఒకరినొకరం బాగా అర్థం చేసుకునేవాళ్లం. బహుశా అతనితో ఆడిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను" అని డివిలియర్స్ తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన అనంతరం 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీ జట్టులో చేరాడు. 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. కోహ్లీ, డివిలియర్స్ జోడీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది. వీరిద్దరూ కలిసి 76 మ్యాచ్‌ల్లో 3,123 పరుగులు సాధించారు. ఇందులో 10 శతక భాగస్వామ్యాలు ఉండటం విశేషం. కోహ్లీ ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.
Latest News