![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 16, 2025, 06:14 AM
భారతదేశం, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరిహద్దుల వెంబడి పరస్పర సైనిక చర్యలను నిలిపివేస్తూ ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని పొడిగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి అధికారుల మధ్య అవగాహన కుదిరింది.మే 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది."మే 10న ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన అవగాహనకు అనుగుణంగా, సరిహద్దుల్లో అప్రమత్తత స్థాయిని తగ్గించేందుకు వీలుగా విశ్వాసం పెంపొందించే చర్యలను కొనసాగించాలని నిర్ణయించాం. పరిస్థితులు మరింత మెరుగుపడిన కొద్దీ, తదుపరి సమాచారం మీకు తెలియజేస్తాం" అని అధికారులు పేర్కొన్నారు.ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
Latest News