దేశవాళీ, కౌంటీ అనుభవం దృష్ట్యా కరుణ్ నాయర్‌ను ఆడించాలన్న కుంబ్లే
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 10:02 PM

భారత క్రికెట్ జట్టు చేపట్టనున్న కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలగడం జట్టుకు ఊహించని పరిణామంగా మారింది. వీరి నిష్క్రమణతో భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్‌లో ముఖ్యంగా నాలుగో స్థానంలో ఏర్పడిన ఖాళీపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. గతంలో విరాట్ కోహ్లీ ఈ స్థానంలో జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే అంశంపై టీమిండియా యాజమాన్యం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో, భారత జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ, ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న కరుణ్ నాయర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి, నాలుగో స్థానంలో అవకాశం కల్పించాలని సూచించారు.ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ, "దేశవాళీ క్రికెట్‌లో ఇటీవల పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ తిరిగి భారత జట్టులోకి రావడానికి అన్ని విధాలా అర్హుడు. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు జట్టుకు అవసరం. కరుణ్ నాయర్‌కు కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది, కాబట్టి అక్కడి పరిస్థితులపై అతనికి మంచి అవగాహన ఉంటుంది" అని తెలిపారు. కరుణ్ వయసు 33 ఏళ్లు దాటినా, అతను ఇంకా చాలా ఫిట్‌గా, యువకుడిలాగే ఉన్నాడని కుంబ్లే అభిప్రాయపడ్డారు. "అతనికి అవకాశం లభిస్తే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలనే ఆసక్తి యువ ఆటగాళ్లలో మరింత పెరుగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినా గుర్తింపు రాకపోతే అది కాస్త నిరుత్సాహపరిచే అంశం అవుతుంది" అని కుంబ్లే విశ్లేషించారు.రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో విదర్భ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్ నాయర్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన అతను, 53.93 సగటుతో 863 పరుగులు సాధించి, టోర్నీలో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఇప్పటివరకు భారత్ తరఫున 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2016లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అతను, తన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ 303 నాటౌట్, చెన్నైలో ఇంగ్లాండ్‌పై సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. మార్చి 2017లో అతను తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కరుణ్ నాయర్ దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో, నాలుగో స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కుంబ్లే సూచనను టీమ్ మేనేజ్‌మెంట్ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.

Latest News
India-New Zealand FTA delivers tangible, wide-ranging benefits to economy Tue, Dec 23, 2025, 11:16 AM
Was raped as I am Haji Mastan's daughter, says Haseen Mastan on sexual abuse case Tue, Dec 23, 2025, 11:14 AM
Trade deal crucial to deepen US-India economic ties: Keshap Tue, Dec 23, 2025, 11:11 AM
Drought continues to impact millions in Somalia: UN Tue, Dec 23, 2025, 11:08 AM
Indian rupee stable in real effective terms, forex reserves adequate: RBI Tue, Dec 23, 2025, 11:04 AM