చిరకాల మిత్రదేశాన్ని పక్కనబెట్టి.. సౌదీకి ఫస్ట్ ప్రయారిటీ
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 08:19 PM

ప్రపంచ యుద్ధాలకు ముందు నుంచి అమెరికా, బ్రిటన్ మిత్రదేశాలు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యేకమైన స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. సైనికంగా, ఆర్థికంగా, వాణిజ్యం పరంగా.. ఈ రెండు దేశాలు చాలా సన్నిహితం. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికల్లో ఈ రెండు దేశాలు ఒకదానికొకటి అండగా నిలుస్తుంటాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలతో కూడిన ఫైవ్ ఐస్ (ఐదు కళ్లు) అనేది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం. ఇందులోనూ బ్రిటన్‌కు అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తుంది.


అయితే గత కొన్నాళ్లుగా బ్రిటన్‌ విషయంలో అమెరికా వైఖరిలో మార్పు కనిపిస్తోందనే భావన వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన గత టర్మ్‌తోపాటు.. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత బ్రిటన్‌కు ఆయన ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.


అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే.. తమ తొలి విదేశీ పర్యటనలో భాగంగా మిత్రదేశమైన యూకే వెళ్లడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు.. ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు.


2017లో సౌదీ అరేబియాకు వెళ్లడం ద్వారా తన విదేశీ పర్యటనలను ప్రారంభించిన ట్రంప్.. ఈసారి కూడా సౌదీకే వెళ్లారు. ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం ట్రంప్ రోమ్ వెళ్లారు. కానీ ఇది ప్రత్యేక సందర్భమని చెప్పొచ్చు.


అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలపాలని భావిస్తున్న ట్రంప్.. తన దేశానికి ఉపయోగపడే పనులు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వాళ్లను వెనక్కి పంపించడం, ఇతర దేశాలపై భారీగా ఆర్థిక సుంకాలు విధించడం లాంటి వాటిని ఈ కోణంలోనే చూడాలి.


అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టే స్థోమత ఉన్న సౌదీ లాంటి దేశాలవైపు ట్రంప్ ఆశగా చూస్తున్నారు. చైనా ప్రాబల్యం పెరుగుతుండటం కూడా ట్రంప్ ప్రాధాన్యాలు మారడానికి కారణం అవుతోంది. తన అగ్రరాజ్య హోదాను లాగేసుకునే స్థాయికి చేరుకుంటున్న డ్రాగన్‌ను కట్టడి చేయడానికి అమెరికా ఫోకస్‌ను యూరప్ నుంచి ఇండో-పసిఫిక్ రీజియన్‌కు మళ్లించింది. దీని వల్ల బ్రిటన్‌తోపాటు, ఇతర యూరప్ దేశాలకు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యంపై ప్రభావం పడుతోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన తర్వాత బ్రిటన్ బలహీనపడింది. ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న బ్రిటన్.. రుణ భారం పెరిగి ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. బ్రెగ్జిట్ తదనంతర పరిణామాలతో అంతర్జాతీయంగా బ్రిటన్ పరపతి కొంత తగ్గిందని చెప్పొచ్చు.


ఇదే సమయంలో పశ్చిమాసియాలో ఒక ముఖ్యమైన శక్తిగా సౌదీ అరేబియా ఎదిగింది. ఈ ప్రాంతంలో అమెరికాకు సౌదీ ప్రధానమైన వ్యూహాత్మక భాగస్వామి అని చెప్పొచ్చు. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఇరాన్ లాంటి దేశాలను నియంత్రించడానికి.. చమురు మార్కెట్‌ను కంట్రోల్ చేయడానికి.. ఇలా అనేక విధాలుగా అమెరికాకు సౌదీ ఎంతో అవసరం.


ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడానికి, అమెరికాకు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే సమయంలో సౌదీ సైతం అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ట్రంప్ సౌదీ పర్యటన సందర్భంగా.. ఈ గల్ఫ్ దేశం అమెరికాలో 600 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఇరు దేశాల మధ్య 142 బిలియన్ డాలర్ల విలువైన భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రక్షణ సహకారం ఒప్పందం ఇదని వైట్ హౌస్ పేర్కొంది.


ఈ ఒప్పందంలో భాగంగా.. సౌదీ అరేబియా అమెరికా నుంచి అధునాతన యుద్ధ సామాగ్రి, సైనిక వ్యవస్థలు, సేవలను పొందుతుంది. వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నౌకాదళ భద్రత, సమాచార వ్యవస్థల ఆధునీకరణ లాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ ఒప్పందం అమెరికాకు అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తుంది.


జో బైడెన్ హయాంలో సౌదీ, అమెరికా మధ్య కొద్దిగా దూరం పెరిగింది. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక తిరిగి సౌదీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. సౌదీ కోణంలో చూస్తే.. ఆ దేశం ఇప్పటికీ చమురు విక్రయాల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతోంది. చమురు నిల్వలు అడుగంటినా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం.. సౌదీ ముందు చూపుతో జీడీపీలో చమురేతర రంగాల వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగా విజన్-2030తో ముందుకెళ్తోంది.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటాలని సౌదీ అరేబియా భావిస్తోంది. ఇందుకోసం సౌదీ యువరాజు సల్మాన్ ‘హుమైన్’ అనే కొత్త సంస్థను స్థాపించారు. దీనికి ప్రపంచంలోని దిగ్గజ టెక్ సంస్థలు, ముఖ్యంగా అమెరికా టెక్నాలజీ సంస్థల నుంచి సహకారం ఆశిస్తోంది. ట్రంప్ గల్ఫ్ టూర్‌లో భాగంగా.. అమెరికా-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొనడం కోసం అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థల అధిపతులు, లీడర్లు సైతం సౌదీ వెళ్లారు. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ అధిపతి ఆల్ట్‌మన్, ఎన్‌విడియాకు చెందిన జెన్‌సెన్ హువాంగ్, అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ, గూగుల్ ప్రెసిడెంట్ రూథ్ పోరట్ తదితరులు సౌదీ వెళ్లారు.


వీటన్నింటిని బట్టి.. ఆర్థిక వ్యవహారాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్న ట్రంప్.. తనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పొచ్చు. చివరగా ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే.. డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సౌదీ అరేబియాతో ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌, కుష్నర్ వాట్సాప్‌‌లో చాట్ చేసుకునేంత క్లోజ్ అని చెబుతారు.

Latest News
'Desperate attempt, won't affect Mahayuti': BJP mocks Thackeray brothers' alliance Wed, Dec 24, 2025, 02:39 PM
Health quizzes held in Gujarat's Sabarkantha to create awareness among adolescents Wed, Dec 24, 2025, 02:30 PM
BP sells 65 pc stake in Castrol for $6 billion Wed, Dec 24, 2025, 02:29 PM
Virat Kohli completes 16,000 List A runs on Vijay Hazare Trophy return Wed, Dec 24, 2025, 02:28 PM
Awami League raises alarm over surge in custodial deaths under Yunus-led interim govt in Bangladesh Wed, Dec 24, 2025, 02:07 PM