కల్నల్ సోఫియా ఖురేషిపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 08:04 PM

ఇండియన్ ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌‌కు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు, మాజీ సైనికాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల "ఆపరేషన్ సిందూర్" సమయంలో విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రితో కలిసి పలుసార్లు మీడియా సమావేశాల్లో కనిపించిన కల్నల్ ఖురేషీ గురించి దేశం మొత్తం చర్చించుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా.. ఓ బహిరంగ ప్రసంగంలో ఆర్మీ అధికారిణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండోర్ సమీపంలో జరిగిన ఓ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు, సామాజిక, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.


ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. వివాదం తీవ్రం కావడంతో మంత్రి విజయ్ షా దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ ప్రకటనలు చేశారు. ‘‘మన దేశానికి కుల, మతాలకతీతంగా సేవ చేసిన సోదరి కల్నల్ సోఫియా ఖురేషి అంటే నాకు అపార గౌరవం... ఆమె మా స్వంత సోదరి కన్నా ఎక్కువ. నేను ఆమె సేవలకు సెల్యూట్ చేస్తున్నాను. నా మాటల వల్ల సమాజం లేదా మతాన్ని గాయపరిచినట్లైతే నేను పది సార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఆయన అన్నారు.


అయితే, తన ప్రసంగంలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ ఆయన చెసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. మతపరమైన కోణంలో మాట్లాడుతూ.. ‘‘ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా "వారి మతానికి చెందిన మన సోదరిని పంపి బుద్ధి చెప్పాం’’ అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రితో కలిసి ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.


‘పహల్గామ్ దాడిలో మన సోదరిల సిందూరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాం. ముష్కరుల స్థావరాలను వారి మతానికి చెందిన సోదరి ద్వారా నాశనం చేశాం. వారు మన హిందూ సోదరులపై దాడులు చేసి, కాల్పులు జరిపారు.. మోదీజీ వారి మతానికి చెందిన సోదరిని ఆర్మీ విమానంలో పంపించి వారి ఇళ్లలోనే వారిపై దాడి చేయించారు. వారు మన సోదరిలను విధవుల్ని చేస్తే.. మోదీజీ వారి మతానికి చెందిన సోదరిని పంపించి వారికి గుణపాఠం చెప్పారు’ అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.


400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు.. భారత ఎయిర్‌పోర్టులు, మిలటరీ స్థావరాలే లక్ష్యం: కేంద్రం


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘మధ్యప్రదేశ్‌ బీజేపీ మంత్రి మన ధీరవనిత సోదరి కల్నల్ సోఫియా ఖురేషీ గురించి అత్యంత దారుణమైన, దిగజారిన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాదులు దేశాన్ని చీల్చాలనుకున్నారు. కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశమంతా ఏకతాటిపై నిలబడి వారికి సమాధానం చెప్పింది. మోదీజీ, ఆ మంత్రిని వెంటనే తొలగించాలి’’ అని ఖర్గే డిమాడ్ చేశారు.


మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ ఈ వీడియోను షేర్ చేస్తూ. ‘‘ఇది బీజేపీ దురాశపూరిత ఆలోచనలకు, ద్వేషపూరిత రాజకీయ ధోరణికి నిదర్శనం’" అని వ్యాఖ్యానించారు. ఇది జాతీయ ఐక్యత, సైనిక గౌరవం, భారత మహిళల గౌరవంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది.

Latest News
Maha Cabinet clears Karmayogi 2.0 and Sarpanch Samvad Wed, Dec 24, 2025, 04:33 PM
New monoclonal antibody safe and effective for rare liver disease Wed, Dec 24, 2025, 04:22 PM
Russia: Two police personnel killed in Moscow explosion Wed, Dec 24, 2025, 04:21 PM
BMC polls: Thackeray cousins' emotional appeal set to clash with BJP's organisational might Wed, Dec 24, 2025, 04:19 PM
Sensex, Nifty end lower ahead of Christmas Wed, Dec 24, 2025, 04:15 PM