కార్యకర్తకు కుక్క బిస్కెట్లు ఇచ్చిన రాహుల్ గాంధీ.
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 10:07 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తతో ఆయన ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యాత్రలో భాగంగా వాహనంపై వెళ్తున్న రాహుల్ గాంధీ.. కార్యకర్తకు కుక్క బిస్కెట్లు ఇవ్వడంతో బీజేపీ నేతలకు మంచి మసాలా దొరికింది. దీంతో రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పార్టీ కార్యకర్తకు కుక్క బిస్కెట్లు ఇస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఓ వాహనంపై రాహుల్ గాంధీ ఉండి.. యాత్ర సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చారు. అప్పుడు ఆ వాహనంపై ఉన్న ఓ పెంపుడు కుక్కకు రాహుల్ గాంధీ బిస్కెట్లు తినిపిస్తున్నారు. అయితే ఆ కుక్క బిస్కెట్లు తినడానికి నిరాకరించడంతో వాటిని అక్కడికి వచ్చిన కార్యకర్తకు రాహుల్ గాంధీ ఇచ్చారు. ఈ ఘటనతో షాక్ అయిన ఆ కార్యకర్త.. వద్దు అంటూ సున్నితంగా తిరస్కరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడ ఉన్న వారు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఐటీ సెల్, బీజేపీ నేతలు అమిత్ మాలవీయ, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. పార్టీ బూత్ ఏజెంట్లను కుక్కలతో పోల్చారని అమిత్ మాలవీయ పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన బిస్కెట్లు కుక్క తినకపోవడంతో.. వాటిని కార్యకర్తలకు ఇస్తున్నారని ట్వీట్ చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ యువరాజు.. కార్యకర్తలను కుక్కల్లా పరిగణిస్తే ఆ పార్టీ అంతం కావడం సాధారణమేనని అమిత్ మాలవీయా ఎద్దేవా చేశారు.


ఇక ఈ ట్వీట్‌కు సమాధానం ఇచ్చిన మరో బీజేపీ నేత పల్లవి సీటీ.. రాహుల్ గాంధీ గతంలో హిమంత బిశ్వ శర్మను కూడా తీవ్రంగా అవమానించారని తెలిపారు. హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు.. కుక్క తినే ప్లేట్‌లో ఆయనకు బిస్కెట్లు పెట్టారని.. అయితే హిమంత బిశ్వ శర్మ వాటిని తిరస్కరించి.. కాంగ్రెస్ పార్టీని వీడారని తెలిపారు. ఈ ట్వీట్‌కు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా వారి కుటుంబం మొత్తం తనను కుక్క బిస్కెట్లు తినేలా చేయలేకపోయిందని తెలిపారు. తాను ఒక అస్సామీగా, భారతీయుడిగా గర్విస్తానని.. అందుకే అవి తినేందుకు నిరాకరించి.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఇక ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర.. ఒడిశాలోకి ప్రవేశించనుంది.


Latest News
Sensex nears 79,000 on softer crude, easing geopolitical tensions Tue, Apr 21, 2026, 11:05 AM
S. Korean firm Naver partners TCS for AI, digital biz opportunities in India Tue, Apr 21, 2026, 11:01 AM
Venezuela launches national rally against US sanctions Tue, Apr 21, 2026, 11:00 AM
Heat to persist in Tamil Nadu, rain likely in parts of state: IMD warning Tue, Apr 21, 2026, 10:59 AM
Golf: Pranavi Urs finishes tied 36th after closing with a 72 Tue, Apr 21, 2026, 10:49 AM