ప్రధాని టూడో కోసం మరో విమానం పంపిన కెనడా
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 10:24 PM

విమానం మొరాయించడంతో జీ 20 సమావేశానికి హాజరైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంకా భారత్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. ఆదివారం సాయంత్రం బయలుదేరడానికి ముందు ఆయన వచ్చిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. జీ 20 శిఖరాగ్ర సదస్సుకు వచ్చిన విదేశీ ప్రముఖులంతా తమ దేశానికి వెళ్లిపోగా.. రెండు రోజులుగా ట్రూడో ఢిల్లీలో హోటల్‌‌కే పరిమితయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ప్రధాని ట్రూడో భారత్ నుంచి బయలుదేరుతారని కెనడా ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆయనను తీసుకెళ్లేందుకు కెనడా నుంచి బయలుదేరిన రెండో విమానం.. ఇటలీ మీదుగా ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఆ విమానాన్ని యునైటెడ్ కింగ్‌డమ్‌కి మళ్లించారు.


విమానం దారి మళ్లింపునకు ఎటువంటి కారణం చెప్పలేదని అమెరికాకు చెందిన సీబీఎస్ న్యూస్ తెలిపింది. అయితే, ట్రూడో వచ్చిన విమానంలో లోపాన్ని సరిచేయడంతో అందులో ఆయన తిరిగి వెళ్లనున్నారు. కెనడా ప్రధాని విమానానికి ఏమి జరిగిందో ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే, సోమవారం మాత్రం కెనడా పీఓఎం.. సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కరించలేం.. పరిస్థితి యథాతథంగా ఉంది అని మాత్రమే పేర్కొనడం గమనార్హం. ‘కెనడా సాయుధ దళాలు తమ ప్రతినిధి బృందాన్ని ఇంటికి తీసుకురావడానికి వారి ఉత్తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం తర్వాత బయలుదేరనున్నారు’ అని ప్రధాని కార్యాలయం తెలిపింది. మరోవైపు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు, సానుభూతిపరులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ట్రూడో ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఆయన భారత్ నుంచి కెనడాకు తిరుగు ప్రయాణంలో జాప్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కెనడాలో తీవ్రవాద మూకలు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం పట్ల కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.


‘వ్యవస్థీకృత నేరాలు, డ్రగ్స్ సిండికేట్‌లు, మానవ అక్రమ రవాణాతో ఇటువంటి శక్తుల అనుబంధం కెనడాకు కూడా ఆందోళన కలిగిస్తుంది.. ఇలాంటి వాటిని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు సహకరించుకోవడం చాలా అవసరం’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్, కెనడాల మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నాయి. వాస్తవానికి శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపలేదు. ఏదో తూతూ మంత్రంగా భారత్, కెనడా ప్రధానులు సమావేశమయ్యారు. ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం వెలుపల ఖలీస్థాన్ మద్దతుదారులు చేపట్టిన నిరసనపై భారత్ తీవ్రంగా మండిపడింది. దీంతో ఉగ్రవాద నిరోధక విభాగం ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టింది. ట్రూడో మాత్రం ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛ... నైతికత.. శాంతియుత నిరసనలకు రక్షణగా నిలుస్తుంది.. ఇది మాకు చాలా ముఖ్యమైనది. అదే సమయంలో హింసను నిరోధించడం, విద్వేషానికి వ్యతిరేకంగా పోరాటాలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన ఉద్ఘాటించారు..

Latest News
12-member Indian shotgun squad set for second ISSF World Cup stage Fri, May 01, 2026, 02:27 PM
Allahabad HC dismisses plea seeking FIR against Rahul Gandhi over 'fighting Indian state' remark Fri, May 01, 2026, 02:19 PM
CM Abdullah refutes as 'total lie' PDP allegation about Urdu being dropped as official language in J&K Fri, May 01, 2026, 02:17 PM
AAP backs Punjab Assembly Special Session; Congress calls it 'political drama' Fri, May 01, 2026, 02:13 PM
'Fear-mongering attempt': Bengal CEO dismisses Abhishek Banerjee's claim of elderly voter dying in polling booth Fri, May 01, 2026, 02:09 PM