ప్రస్తుతం 'కుబేర' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న నటి రష్మిక మందన్న, తన సహనటుడు ధనుశ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ధనుశ్ వ్యక్తిత్వం, సెట్‌లో ఆయన ప్రవర్తించే తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ధనుశ్‌తో తాను దిగిన ఒకే ఒక్క సెల్ఫీని పంచుకుంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు."మీతో ఇంత పెద్ద సినిమా చేసినా మన ఇద్దరికీ కలిపి ఇదొక్కటే సెల్ఫీ ఉంది. మీరు నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి. మనం మాట్లాడుకున్న ప్రతీసారి వేర్వేరు నగరాల్లో, వేర్వేరు పనుల్లో ఉండేవాళ్లం. విశ్రాంతి ఎంత అవసరమో మాట్లాడుకునేవాళ్లం. కానీ ఎప్పుడూ తీసుకునేవాళ్ళం కాదు" అని రష్మిక తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ధనుశ్ అద్భుతమైన నటుడే కాకుండా, గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు. సెట్‌లో అందరితోనూ ఆయన ఎంతో మర్యాదగా ఉంటారని తెలిపారు. "ముఖ్యంగా మీరు సెట్‌లో నాకోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నాకు తమిళ డైలాగుల్లో మీరు చేసిన సాయం, నేను ఏదైనా డైలాగు చెప్పినప్పుడు మీరు మెచ్చుకున్న తీరు.. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ జీవితమంతా గుర్తుండిపోతాయి" అంటూ ధనుశ్ పట్ల రష్మిక తన అభిమానాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు.ఇక 'కుబేర' సినిమా విషయానికొస్తే, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామాలో ధనుశ్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. ధనవంతుల ఆశ, పేదవారి ఆకలి మధ్య జరిగే సంఘర్షణను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. 'కుబేర'లో సమీరా పాత్రలో నటించిన రష్మిక, తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa