సరళమైన కథలతో, సున్నితమైన భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించి తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. 'ఆనంద్', 'గోదావరి', 'ఫిదా' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, ఆయన ఇప్పుడు ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి భారీ తారాగణంతో 'కుబేర' అనే విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో, 150 రోజుల పాటు చిత్రీకరించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా, శేఖర్ కమ్ముల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.'కుబేర' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో "సరస్వతీ దేవి తలెత్తుకుని చూసేలా ఈ సినిమా ఉంటుంది" అని తాను చేసిన వ్యాఖ్యలపై కమ్ముల స్పందిస్తూ, "సుమారు 25 ఏళ్ల నా ప్రయాణంలో, కంటెంట్ పరంగా ఎంతో గర్వంగా, సంతోషంగా చెప్పిన మాట అది. మనం పట్టించుకోని, మనకు తెలియని ఓ గొప్ప ప్రపంచాన్ని, అలాగే అత్యంత పేద ప్రపంచాన్ని చూపించగలుగుతున్నాననే సంతృప్తితో ఆ మాట అన్నాను. ఎవరూ ధైర్యం చేయని కథను చెప్పగలిగానన్న సార్థకత ఉంది" అని వివరించారు. తన అన్ని సినిమాల కంటే ఇదే గొప్పదని కాకపోయినా, ఒక ప్రత్యేకమైన ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నానని ఆయన తెలిపారు.తన సినిమాల్లో 'సిగ్నేచర్' గురించి ప్రస్తావిస్తూ, అది కేవలం అందమైన ప్రేమకథలు తీయడం కాదని, ఏ కథ చెప్పినా దానిని నిజాయతీగా, బాధ్యతతో చెప్పడమే తన మార్క్ అని శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు. "‘లీడర్’ సినిమాలో రాజకీయ నేపథ్యాన్ని వాస్తవికంగా చూపించాను. 'కుబేర'లో కూడా పాత్రలు, లొకేషన్లు, కథాంశం అన్నీ వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. పాత్రల పరంగా నిజాయతీగా ఉండటమే నా సిగ్నేచర్" అని ఆయన అన్నారు. ఫిల్మ్‌మేకర్‌గా పరిణామం చెందుతూ, చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రభావితమవుతూ కథలు ఎంచుకుంటానని తెలిపారు.ధనుష్, నాగార్జున వంటి స్టార్లను ఎంచుకోవడం వెనుక మార్కెట్ విస్తరణ ఆలోచనలు లేవని కమ్ముల తెలిపారు. "సినిమా చూశాక ధనుష్ తప్ప ఆ పాత్రను ఇంకెవరూ చేయలేరని మీకే అనిపిస్తుంది. నాగార్జున గారి నటన కూడా అద్భుతంగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ముంబై నేపథ్యంలో సాగే కథ కావడంతో కొందరు హిందీ నటీనటులను తీసుకున్నామని, మిగతాదంతా పాత్రల డిమాండ్ ప్రకారమే జరిగిందని వివరించారు. రష్మిక మందన్న ఎంపిక గురించి మాట్లాడుతూ, ఆమె కమర్షియల్ స్టార్ అయినా, నటిగా ప్రతిభావంతురాలని, పాత్రకు కావాల్సిన అమాయకత్వం, చిలిపితనం ఆమెలో కనిపించాయని ప్రశంసించారు.ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. థ్రిల్లర్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఈ సినిమాకు దేవి శ్రీ కమర్షియల్ ఎడ్జ్ ఇచ్చారని కమ్ముల తెలిపారు. సినిమా నిడివి సుమారు మూడు గంటలు ఉండటంపై, "కథలో అంత విషయం ఉంది. రెండు విభిన్న ప్రపంచాలు, ఎంతో మంది పాత్రలు, వారి కథలు చెప్పడానికి అంత సమయం అవసరమైంది. అనవసరంగా ఒక్క సన్నివేశం కూడా ఉండదు" అని వివరించారు. భారీ బడ్జెట్, ఎక్కువ రోజుల షూటింగ్ కూడా కథ డిమాండ్ చేసిందేనని, కొన్నిసార్లు భయపడినా కథ కోసమే ఈ సినిమా చేశానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa