విజయం కోసం పరితపిస్తున్న యువ నటుల్లో మెగా కుటుంబం నుండి వచ్చిన వరుణ్ తేజ్ ఒకరు. వరుణ్ కి ఒక మంచి బ్రేక్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఐదేళ్ల క్రితం చేసిన 'గద్దలకొండ గణేష్' అనే సినిమా పరవాలేదు బాగానే ఆడింది అని అన్నారు, అంతే ఆ తరువాత వరుణ్ కొన్ని సినిమాలు చేసినా విజయం మాత్రం వరించలేదు. ఆ సినిమా తరువాత పాండెమిక్ రావటం, కొంచెం విరామం తీసుకోవటం జరిగింది. 'గద్దలకొండ గణేష్' చేసిన మూడేళ్ళ తరువాత 'ఘని' అని బాక్సింగ్ నేపధ్యంలో వచ్చిన సినిమా చేశారు, కానీ అది తీవ్ర నిరాశే మిగిల్చింది. విడుదలైన రెండో రోజుకే ఆ సినిమాని కొన్ని థియేటర్స్ నుండి తీసేసారు.ఆ తరువాత వరుణ్ ఎక్కువ సినిమాలు ఒప్పుకోలేదు అనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన 'F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' ముందు వచ్చిన 'ఎఫ్ 2' కి సీక్వెల్ గా వచ్చింది. ఇందులో వెంకటేష్ ఇంకో కథానాయకుడిగా వేశారు, కానీ ఈ సినిమా మొదటి సినిమా అంత విజయం సాధించలేదనే చెప్పాలి. గత సవంత్సరం 'గాండీవధారి అర్జున' అనే గూఢచారి, యాక్షన్ నేపధ్యం వున్న సినిమా చేశారు. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. అయినా ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. గత సంవత్సరం తన సహచరి నటి లావణ్య త్రిపాఠి ని వివాహం చేసుకున్నారు.ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఇది ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో కొన్ని నిజ సంఘటనల ఆధారంగా మలిచిన చిత్రం అని చెపుతున్నారు. దీనికి హిందీ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహించారు. అయితే ఇది మరి తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుందా అని ఒక చిన్న సందేహం అని పరిశ్రమలో టాక్. అలాగే ఈ సినిమా వార్ నేపధ్యం కూడా ఉంటుంది అని చెపుతున్నారు.ఇలాంటి నేపధ్యం వుండే సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంతకు ముందు వరుణ్ తేజ్ 'అంతరిక్షం' అనే సినిమా ఒకటి చేశారు. కానీ ఇది ప్రేక్షకులకి అంతగా ఎక్కలేదు. మరి ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమా తెలుగు ప్రేక్షకులకి ఆసక్తికరంగా ఉంటుందా? ఎందుకంటే ఈ సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో వుంది, మరి ఇలాంటి టైటిల్ పెడితే మాస్ ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా అని ఒక సందేహం కూడా వుంది అని చర్చ. అదీ కాకుండా ఈమధ్య పాన్ ఇండియా కథలంటూ తెలుగు నటులు చాలామంది ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరూ సఫలం కాలేదు. మరి వరుణ్ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి ప్రచారాలు కూడా బాగానే చేస్తున్న వరుణ్ తేజ్ కి ఇప్పుడు ఒక మంచి విజయం కావాలి, అందుకోసం ఎదురుచూస్తున్నారు, ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' అతనికి ఆ బ్రేక్ ఇస్తుందని ఆశిద్దాం!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa