ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గుంటూరు కారం' ఎలా ఉందొ చూద్దాం రండి

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 02:09 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు 14 ఏళ్ల తరువాత 'గుంటూరు కారం' సినిమా రూపంలో ఆ అవకాశం వచ్చింది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది, ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ ఇతర తారాగణం. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాకి నిర్మాత. ఈ పండగకి విడుదలైన చిత్రాల్లో అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా ఇదే. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. 


 కథ:


వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) ఒక రాజకీయనాకుడు, అతని కుమార్తె వసుంధర (రమ్యకృష్ణ) కూడా రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. వసుంధరకి మొదట సత్యం (జయరాం) తో వివాహం అవుతుంది వాళ్ళకి పుట్టిన కుమారుడు రమణ (మహేష్ బాబు). కానీ వూర్లో గొడవలు రావటం అందులో ఆమె భర్త ఉండటంతో, భర్తని, కొడుకుని గుంటూరులో వదిలేసి హైదరాబాదులో వున్న తన తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది వసుంధర. అక్కడే రెండో సారి నారాయణని (రావు రమేష్) పెళ్లిచేసుకుంటుంది, వాళ్ళకి రాజగోపాల్ (రాహుల్ రవీంద్రన్) అని కుమారుడు ఉంటాడు. వెంకటస్వామి తన నిజమైన వారసుడు రాజగోపాల్ అని చెప్పుకుంటూ అతన్ని కూడా ఎన్నికల్లో పోటీ చేయించడానికి సమాయత్తం అవుతూ ఉంటాడు. అయితే మొదటి వారసుడు రమణని హైదరాబాదు పిలిపించుకొని తనకి ఆస్తి అవసరం లేదు అని, వసుంధరకి తనకి సంబధం లేదని దస్తావేజు కాయితాల మీద సంతకం పెట్టమని చెపుతూ ఉంటాడు. వెంకటస్వామి వకీలు పాణి (మురళి శర్మ) రమణతో ఎలా అయినా సంతకం పెట్టిస్తాను అని చెప్పి తన కూతురు అమ్ములు (శ్రీలీల)ని గుంటూరు పంపిస్తాడు. అమ్ములు, బాలు (వెన్నెల కిషోర్) తో గుంటూరు వెళుతుంది, కానీ ఆమె రమణతో ప్రేమలో పడుతుంది. ఇంతకీ రమణ సంతకం పెట్టాడా? రమణకి, తల్లి వసుంధర అంటే ఎందుకు కోపం? వెంకటస్వామి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎటువంటి రాజకీయ ఎత్తులు వేసాడు? చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే 'గుంటూరు కారం' చూడాల్సిందే.


విశ్లేషణ:


దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాటల మాంత్రికుడు అని పేరుంది. అందుకని అయన సినిమాలలో చిన్న చిన్న సరదా మాటలు రాస్తూ ప్రేక్షకులని కట్టి పడేస్తూ వుంటారు. అలాగే అతని మాటల్లో, చిన్న వెటకారం, చిలిపితనం, ప్రాస ఇవన్నీ ఉంటాయి, అందుకే అతని మాటలని ప్రేక్షకులు బాగా ఆనందిస్తూ వుంటారు. ఈ 'గుంటూరు కారం' సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్, కేవలం మహేష్ బాబుని అతని అభిమానులకు ఎలా కావాలో అలా చూపించాలని అనుకున్నాడు. అందుకే మహేష్ ని దృష్టిలో పెట్టుకొని మాటలు రాసాడు. తల్లి సెంటిమెంట్ నేపధ్యంగా ఎంచుకొని మహేష్ ని ఒక మాస్ అవతారంలో చూపించాలి అనుకున్నాడు. మొత్తం సినిమా అంతా మహేష్ బాబు మీదే ఉంటుంది. సరదాగా సాగుతూ, మధ్యలో మహేష్ బాబు తో డాన్సులు, పోరాట సన్నివేశాలు అందంగా చేయిస్తూ మొదటి సగం పూర్తి చేయిస్తాడు. ఇక రెండో సగంలో కథ గురించి ఒక్కొక్కటీ విప్పుకుంటూ వెళతాడు. జయరాం, మహేష్ బాబు తండ్రీ కొడుకులు, ఎందుకు గుంటూరులో వున్నారు, మహేష్ బాబు, తల్లి రమ్యకృష్ణను కలుద్దాం అని వస్తే ఆమె ఎప్పుడూ అతన్ని కలవదు. ఒకరంటే ఒకరికి పడనట్టు వున్నా, వాళ్ళిద్దరి మధ్య వుండే ఆ తల్లి కొడుకుల అనుబంధాన్ని, వాళ్ళ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలని బాగా చూపించగలిగాడు త్రివిక్రమ్. రమ్య కృష్ణ మీద దాడులు జరుగుతాయి, అందరూ అది వేరేవాళ్లు చేయించారు అని అనుకుంటారు, చివరికి అది ఎవరు చేయించారు అనేది తెలిసాక అందరికీ ఒక షాక్ లా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ 'గుంటూరు కారం' మెయిన్ కథ యద్దనపూడి సులోచనారాణి 'కీర్తి కిరీటాలు' ఆధారంగా తీసుకున్నదే అని అర్థం అయిపోతోంది. అయితే ఆ నవల అప్పుడెప్పుడో నాలుగైదు దశాబ్దాల కిందట వచ్చింది కాబట్టి, ఆ కథని ఇప్పుడు నవల్లో ఉన్నట్టు తీస్తే ప్రేక్షకులకి అంతగా ఎక్కదు అని త్రివిక్రమ్ ఆ కథని కొంచెం ఆధునికంగా తయారు చేసి 'గుంటూరు కారం' సినిమాగా మలిచాడు. నవలలో కూడా అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, సినిమాలో కూడా అదే ముఖ్యమైన భాగం. ఈ సినిమాలో మహేష్ లో ఒక కొత్త అవతారం చూస్తారు. అతని డాన్సులు, డైలాగ్ డెలివరీ, గుంటూరు యాస, శ్రీలీలని టీజ్ చేసే విధానం, ఇలా అన్నీ కొత్తగా ఉంటాయి. అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేసినవి ఇవన్నీ. స్క్రీన్ మీద పాటలన్నీ బాగుంటాయి, ఈలలు, గోలలు, చప్పట్లు వేస్తూనే వుంటారు, మహేష్ బాబు ఆ పాటలకి డాన్స్ చేస్తున్నప్పుడల్లా. అలాగే ఛాయాగ్రహణం బాగుంటుంది, థమన్ సంగీతం కూడా బాగుంది. అలాగే ఈ సినిమా కృష్ణ గారి అభిమానులకి కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే సినిమాలో కృష్ణ గారి రిఫరెన్స్ చాలా చోట్ల ఉంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు సినిమాలో ఈమధ్యకాలంలో మొదటిసారి బాగా డాన్సులు బాగా చేసాడు. సినిమా అంతా మహేష్ తన భుజాలమీద వేసుకున్నాడు. కామెడీ, భావోద్వేగాలు, డాన్సులు, పోరాట సన్నివేశాలు, ఒకటేంటి అన్నీ చాలా బాగా చేసి అంతా తానే అయ్యి సినిమాలో కనిపిస్తాడు. శ్రీలీల డాన్సులు అదరగొట్టింది, అలాగే ఆమె నటన కూడా బాగుంది. ఒక తెలుగు అమ్మాయి కథానాయకురాలిగా చూడటం బాగుంది. మీనాక్షి చౌదరి అతిధి పాత్రలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ కి చాలా కాలం తరువాత మళ్ళీ ఒక మంచి పాత్ర వచ్చింది, అతనికి ఇలాంటివి కొట్టిన పిండి, అందుకని చేసుకుపోయాడు. రమ్య కృష్ణ మహేష్ బాబు తల్లిగా చాలా బాగా చేసింది. ఆమెకి కూడా క్లైమాక్స్ లో మంచి మాటలు రాయటమే కాకుండా, ఆమె నటనలో ఆమె అనుభవం కనపడుతుంది. ఇక మురళి శర్మ లాయర్ గా కనపడతాడు, అతనికి ఇది రెగ్యులర్ పాత్ర. వెన్నెల కిశోర్ ఈ సినిమాలో చాలా సేపు కనపడతాడు, అలాగే నవ్విస్తాడు కూడా. రావు రమేష్ అక్కడక్కడా కనపడినా, క్లైమాక్స్ లో మాత్రం ఒక్కసారిగా మెరుస్తాడు. ప్రకాష్ రాజ్ తో అతను చెప్పే ఆ రెండు సన్నివేశాలు క్లైమాక్స్ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. అతను డైలాగ్స్ చెపుతుంటే ప్రేక్షకులు నిశ్శబ్దంగా వింటూ వుంటారు. అది అతనిలో వున్న ఒక మేజిక్ అని చెప్పాలి. బ్రహ్మాజీ పోలీసు ఇనస్పెక్టర్ గా బాగా చేశారు. ఈశ్వరి రావుకి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది, ఆమె హుందాగా నటించి మెప్పించింది. అజయ్, అజయ్ ఘోష్, రాహుల్ రవీంద్రన్ ఇంకా మిగతా అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. చివరగా, 'గుంటూరు కారం' సినిమా మహేష్ బాబు సినిమా అని చెప్పొచ్చు. మొదటి నుండి చివరి వరకు త్రివిక్రమ్ రాసిన మాటలను, తనదైన శైలిలో చెపుతూ, డాన్సుల్లో అదరగొడుతూ, పోరాటాల్లో తన స్టయిల్ చూపిస్తూ ప్రేక్షకులని అలరిస్తాడు. మహేష్ బాబు ప్రేక్షకులతో పాటు, కుటుంబం అంతా పండగకి హాయిగా చూసి ఆనందించే సినిమా ఇది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa