ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో వీఆర్ హైస్కూలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వీఆర్ హైస్కూల్ పేరు మార్చడం మీద ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వీఆర్ హైస్కూలు అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి సహకరిస్తే.. మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు ఎలా అవుతుందని ఆనం ప్రశ్నించారు. వీఆర్ విద్యాసంస్థలు ఆనం కుటుంబం పర్యవేక్షణలో ఉన్నాయన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా తనను మేనేజింగ్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందన్నారు.
వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలులో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని మంత్రి వేదిక మీద ఉన్న మంత్రి నారా లోకేష్ దృష్టికి ఆనం రామనారాయణరెడ్డి తీసుకువచ్చారు. వీఆర్ హైస్కూలును కార్పొరేట్ స్కూలుగా మారిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. నెల్లూరులో కార్పొరేట్ స్కూల్స్ పెరుగుతున్న పరిస్థితుల్లో కార్పొరేషన్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లుగా మారకుండా చూడాలని అన్నారు.
" వీఆర్ స్కూలును అభివృద్ధి చేసే క్రమంలో అనేక కార్పొరేట్ సంస్తలు, కాంట్రాక్టర్లు అందరూ కూడా సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి ఈ స్కూలు మళ్లీ ప్రారంభం కావటానికి సహకరించారు. బ్యాంకులు కూడా కొన్ని భాగం పంచుకున్నాయి. ఇందులో కార్పొరేషన్ నిధి ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ చెప్పాలి. ఆయన కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ అని నామకరణం చేశారు. మున్సిపల్ మంత్రిగారు ప్రయత్నం చేస్తే.. అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు ఎలా అవుద్దో నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి తప్పులు భవిష్యత్లులో జరగకూడదు. ప్రభుత్వ పాఠశాలలను మంత్రి నారాయణ దత్తత తీసుకోవాలి. నెల్లూరులో కార్పొరేట్ వ్యవస్థ వేన్నూళ్లుకుపోయింది. కార్పొరేషన్ స్థానంలో కార్పొరేట్ వచ్చి చేరితే.. నెల్లూరులో ఇంకొక కార్పొరేట్ స్కూలు అవుతుందేమో. ఇదంతా లోకేష్ గారు తెలుసుకోవాలి." అని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
మరోవైపు నెల్లూరు వీఆర్ హైస్కూలు గతంలో మూతపడింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీఆర్ హైస్కూలు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వీఆర్ హైస్కూలు అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే పలు సంస్థల, కాంట్రాక్టర్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులు సమకూర్చారు. దీంతో వీఆర్ హైస్కూల్ రూపు రేఖలు మారిపోయాయి. కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించారు. రూ.15 కోట్లతో ఈ పనులు చేపట్టి.. ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభించారు. ఈ స్కూలుకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఇటీవల అడ్మిషన్ క్లోజ్ అంటూ బోర్డు కూడా పెట్టారు.ఈ ఏడాది వేయి మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa