టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆటతీరుపై సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ అద్భుతమైన ప్రతిభావంతుడని కొనియాడుతూనే, కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, పంత్ సాధించిన శతకాలను భారీ స్కోర్లుగా, డబుల్ సెంచరీలుగా మార్చాలని అశ్విన్ ఆకాంక్షించారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో లీడ్స్ వేదికగా జరిగిన టెస్టులో పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ వరుసగా 134, 118 పరుగులు చేసి శతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనను అభినందించిన అశ్విన్ పంత్ సంబరాల తీరుపై కూడా స్పందించారు.లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ పూర్తి కాగానే పంత్ ఫ్రంట్ ఫ్లిప్ విన్యాసంతో సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీపై శతకం చేసినప్పుడు కూడా పంత్ ఇలాంటి విన్యాసమే చేశాడు. అయితే, టెస్టు క్రికెట్‌లో శరీరం తీవ్రంగా అలసిపోతుందని, ఇలాంటి ఫ్లిప్‌లు చేయడం వల్ల గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు. "పంత్‌కు నాదొక విన్నపం. దయచేసి ఆ ఫ్రంట్ ఫ్లిప్ చేయవద్దు. ఐపీఎల్‌లో శరీరం అంతగా అలసిపోదు కాబట్టి అక్కడ ఫ్లిప్‌లు చేసినా పర్వాలేదు. కానీ, టెస్టు క్రికెట్ భిన్నమైంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సూచించారు.లీడ్స్ టెస్టులో భారత జట్టు ఓటమి అనంతరం టీమిండియా ప్రదర్శనపై విశ్లేషణ చేస్తూ అశ్విన్ పలు అంశాలను ప్రస్తావించారు. "టీమిండియా బ్యాటర్లు ప్రతి ఇన్నింగ్స్‌లోనూ పరుగులు చేయడం కంటే ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోవడంపై దృష్టి సారించాలి. ఎక్కువ సమయం క్రీజులో ఉండి ఇంగ్లాండ్ ఫీల్డర్లను అలసిపోయేలా చేయాలి. ఓటమికి భయపడాల్సిన అవసరం లేదు" అని అశ్విన్ సూచించారు. తుది జట్టులో భారీ మార్పులు చేయకూడదని, రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయగల సత్తా టీమిండియాకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇంగ్లండ్ జట్టు వ్యూహాలను సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని, లేదంటే సిరీస్ త్వరగా చేజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు."ఐదో రోజు వరకు బ్యాటింగ్ చేయాలి. లేకపోతే కథ ముగిసిపోతుంది. ఐదో రోజు ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఛేదిస్తామని ఇంగ్లాండ్ జట్టు చెబుతోంది. కాబట్టి, ఈ విషయాన్ని మన బ్యాటింగ్ లైనప్ గుర్తుంచుకోవాలి. ప్రత్యర్థికి తక్కువ సమయం ఇచ్చి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 400-450 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే మనం మ్యాచ్ గెలవగలం. పిచ్‌ను బట్టి ఆటను మార్చుకుంటూ ఉండాలి" అని అశ్విన్ విశ్లేషించారు.రిషభ్ పంత్‌ను తరచూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పోల్చడంపై కూడా అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. "పంత్‌ను ధోనీతో పోల్చడం సరికాదు. ఎందుకంటే పంత్ చాలాసార్లు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. అతడిని విరాట్ కోహ్లీ వంటి వారితో పోల్చాలి. పంత్ ప్రధానంగా బ్యాటర్ కావడం, ఇంకా చాలా కెరీర్ ముందుండటమే ఇందుకు కారణం" అని అశ్విన్ స్పష్టం చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa