రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతను పెద్దఎత్తున ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. డ్రోన్ కెమెరాల ద్వారా నేరస్థుల ఆట కట్టిస్తున్నారు ఏపీ పోలీసులు. శివారు ప్రాంతాలు, నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తూ.. గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమస్మాత్మక ప్రాంతాలలో సోలార్ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చనేదీ వీరి ఆలోచన. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా సౌర శక్తితో పనిచేసే సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
వేసవి సెలవుల నేపథ్యంలో ఎక్కువ మంది విహార యాత్రలు, వినోద యాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. ఇళ్లకు తాళాలు వేసుకుని పొరుగూర్లకు, పర్యటనలకు వెళ్తుంటారు. అలాంటి ఇళ్లనే టార్గెట్ చేసుకుని వేసవి కాలంలో దొంగలు రెచ్చిపోతుంటారు. ఈ నేపథ్యంలో దొంగల బాధ తప్పించుకునేందుకు, చోరీలు జరగకుండా అరికట్టేందుకు ఈ సోలార్ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తిరుపతి ఎస్పీ తెలిపారు. పోలీసుల సాయంతో ఈ సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్తున్నారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో 50, తిరుపతిలో 20 , గూడూరులో 20 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అలాగే కోడూరు మామండురు వెళ్లే మార్గంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇక డ్రోన్ కెమెరాల సహాయంతో రాత్రి వేళల్లోనూ తిరుపతి జిల్లా పోలీసులు గస్తీ కాస్తున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో గడిచిన వారం రోజుల్లో గంజాయి స్థావరాలు, నాటు సారా తయారీ ప్రాంతాలను గుర్తించారు. ఏపీలో తొలిసారిగా అర్ధరాత్రి సమయంలోనూ డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నట్లు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రాత్రి వేళ గంజాయి, నాటు సారా తయారీ చేసేవారితో పాటుగా జూదగాళ్లను అరికట్టేందుకు తిరుపతి జిల్లా పోలీసులు మాట్రిక్ ఫోర్ ధర్మల్ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. వీటి సాయంతో తిరుపతి పోలీసులు అల్లరి మూకల ఆట కట్టిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని భావిస్తున్నారు.
![]() |
![]() |