☼ Suryaa News
🔴 క్రీడలు ఆగర్-అలియాసిమ్‌పై ఖచనోవ్ సంచలన విజయం
క్రీడలు

ఆగర్-అలియాసిమ్‌పై ఖచనోవ్ సంచలన విజయం

04 Sep 2026 vasu

కెనడియన్ స్టార్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన రష్యన్ ప్లేయర్
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో రష్యాకు చెందిన ప్రపంచ 50వ ర్యాంకర్ కారెన్ ఖచనోవ్ సంచలన విజయం సాధించాడు. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో గురువారం జరిగిన హోరాహోరీ రెండో రౌండ్ పోరులో కెనడా ఆటగాడు, 2025 సెమీ-ఫైనలిస్ట్ అయిన ఆలియస్సే ఆగర్-అలియాసిమ్‌ను 6-7(5), 6-3, 6-2, 6-2 సెట్ల తేడాతో ఓడించి మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు.

తొలి సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లి హోరాహోరీగా పోరాడినప్పటికీ ఆగర్-అలియాసిమ్ చేతిలో ఓడిపోయిన ఖచనోవ్, ఆ తర్వాత అద్భుతమైన రీతిలో పుంజుకున్నాడు. కెనడియన్ ఆటగాడు శారీరక అసౌకర్యంతో ఇబ్బంది పడటాన్ని సానుకూలంగా మలుచుకున్న ఖచనోవ్.. తన పవర్ ఫుల్ సర్వ్‌లు, రిటర్న్‌లతో మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించాడు. ప్రత్యర్థి సర్వ్‌ను ఏడుసార్లు బ్రేక్ చేయడమే కాకుండా, తాను ఎదుర్కొన్న తొమ్మిది బ్రేక్ పాయింట్లలో ఏడింటిని విజయవంతంగా కాపాడుకుని వరుసగా మూడు సెట్లను సునాయాసంగా గెలుచుకున్నాడు.

ఈ విజయంతో ఖచనోవ్ తన కెరీర్‌లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్) మూడో రౌండ్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. అలాగే గ్రాండ్ స్లామ్‌లలో టాప్-10 ఆటగాడిపై అతనికి ఇది రెండో విజయం కావడం విశేషం.

కాగా, మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన ఖచనోవ్ తన తదుపరి పోరులో ఫ్రాన్స్‌కు చెందిన బెంజమిన్ బోంజీ లేదా పెరూకు చెందిన 32వ సీడ్ ఇగ్నాసియో బూసేలతో తలపడనున్నాడు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home