☼ Suryaa News
🔴 క్రీడలు యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం
క్రీడలు

యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం

18 Sep 2026 vasu

గోల్‌కీపర్ తప్పిదాలతో నిజ్మెగెన్ ఓటమి
రోమ్: యూరోపా లీగ్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఇటాలియన్ క్లబ్ జువెంటస్ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో డచ్ జట్టు ఎన్‌ఈసీ నిజ్మెగెన్‌ను 5-0 తేడాతో చిత్తు చేసింది. నిజ్మెగెన్ గోల్‌కీపర్ నికోలస్ పోల్స్టర్ చేసిన రెండు తీవ్రమైన పొరపాట్లు జువెంటస్ విజయానికి దోహదపడ్డాయి. ఆట 9వ నిమిషంలో పోల్స్టర్ పొరపాటును సొమ్ము చేసుకుంటూ నికోలస్ గొంజాలెజ్ తొలి గోల్ చేయగా, అనంతరం కెరిమ్ అలజ్‌బెగోవిక్, నిక్ వోల్టెమేడ్‌లు గోల్స్ సాధించడంతో జువెంటస్ ప్రథమార్ధంలోనే 3-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో జెకి సెలిక్, రాండల్ కోలో మువానీలు చెరో గోల్ చేయడంతో జువెంటస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన ఒలింపిక్ డి మార్సెయిల్ 1-4 తేడాతో టర్కీ క్లబ్ బెసిక్టాస్ చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్టల్ ప్యాలెస్ 3-0తో లెచ్ పోజ్నాన్‌పై, బోర్న్‌మౌత్ 2-1తో రియల్ సోసిడాడ్‌పై విజయాలు సాధించాయి. స్కాటిష్ ఛాంపియన్ సెల్టిక్ జట్టును హంగేరీకి చెందిన ఫెరెన్‌క్వారోస్ 3-1 తేడాతో ఓడించగా, గ్రీస్ జట్టు ఓఎఫ్‌ఐ క్రీట్ 2-0తో హాఫెన్‌హైమ్‌పై, ఆర్‌బి సాల్జ్‌బర్గ్ 1-0తో లెవ్‌స్కీ సోఫియాపై విజయాలు నమోదు చేశాయి.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home