☼ Suryaa News
🔴 క్రీడలు పాకిస్థాన్‌ను 19-0తో చిత్తు చేసిన భారత మహిళల జట్టు
క్రీడలు

పాకిస్థాన్‌ను 19-0తో చిత్తు చేసిన భారత మహిళల జట్టు

10 Sep 2026 vasu

జూనియర్ ఆసియా కప్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశం
న్యూఢిల్లీ: 2026 మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జూనియర్ మహిళల జట్టు ప్రభంజనం సృష్టించింది. గురువారం జరిగిన ఏకపక్ష క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19-0 తేడాతో చిత్తుగా ఓడించి సెమీఫైనల్స్‌లోకి సగర్వంగా దూసుకెళ్లింది. ఈ విజయంతో హ్యాట్రిక్ ఖండాంతర టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి భారత్ కేవలం రెండు విజయాల దూరంలో నిలిచింది.

టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, మ్యాచ్ ప్రారంభం నుంచే పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పూజా సాహూ 7వ నిమిషంలో తొలి గోల్‌తో ఖాతా తెరవగా, పూజా మాలిక్ హ్యాట్రిక్ గోల్స్ (27′, 49′, 51′) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. వారితో పాటు రోష్ని ఐంద్, సనిక చంద్రకాంత్ మానే, మధు సిదార్, సుప్రియ రెండేసి గోల్స్ చేయగా; తనుశ్రీ, సుఖ్‌వీర్ కౌర్, గీతా యాదవ్, తనుజ తోప్పో, పూర్ణిమ యాదవ్, కృష్ణ శర్మ, బినిమా ధన్ తలా ఒక గోల్ సాధించి జట్టుకు 19-0తో చారిత్రక విజయాన్ని అందించారు.

గ్రూప్ దశలో జపాన్, మలేషియా, దక్షిణ కొరియాలపై వరుస విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు, సెమీఫైనల్‌లో దక్షిణ కొరియా-మలేషియా మ్యాచ్ విజేతతో తలపడనుంది. 2023, 2024లలో జూనియర్ ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకున్న భారత్, ఈసారి వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home