జాతీయం
మహారాష్ట్ర మంత్రి బాబాసాహెబ్ పాటిల్‌పై ఆర్బీఐ కొరడా: లాతూర్ డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసన
సూర్య జాతీయ డెస్క్: మహారాష్ట్ర సహకార శాఖ మంత్రి బాబాసాహెబ్ పాటిల్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. లాతూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ల పదవీకాల పరిమితి నిబంధనలను ఉల్లంఘించిన వ్యవహారంలో మంత్రి బాబాసాహెబ్ పాటిల్‌తో పాటు మరో ఏడుగురు డైరెక్టర్లను పదవుల నుంచి తొలగిస్తూ ఆర్బీఐ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకింగ్ నిబంధనల చట్టం ప్రకారం సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీకాలం గరిష్టంగా పదేళ్లు మాత్రమే ఉండాలని, ఆ గడువు దాటిన తర్వాత కూడా పదవుల్లో కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ వివాదంపై లాతూర్ డీసీసీ బ్యాంక్ సభ్యుడు సతీష్ శేషారావు జాదవ్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో ఆర్బీఐ చర్యలు వేగవంతమయ్యాయి. పదేళ్లకు మించి పదవుల్లో కొనసాగుతున్న డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన డైరెక్టర్లపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వివాదం ముదరడంతో ఏడుగురు డైరెక్టర్లు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించగా, మంత్రి బాబాసాహెబ్ పాటిల్ మాత్రం రాజీనామాకు నిరాకరించడంతో నేరుగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ ఆర్బీఐ ఉద్వాసన పలికింది.రాష్ట్ర సహకార శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రే తన సొంత జిల్లా సహకార బ్యాంకులో నియమ నిబంధనలు పాటించలేదనే కారణంతో తొలగింపునకు గురికావడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాలు చేసేందుకు మంత్రి పాటిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సహకార బ్యాంకుల్లో పారదర్శకతను పెంచేందుకు, రాజకీయ జోక్యాన్ని తగ్గించేందుకు పదవీకాల పరిమితులను ఖచ్చితంగా అమలు చేయాలన్న కేంద్ర బ్యాంక్ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.