సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశంతో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం తత్వం థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. దినేష్ తేజ్, దష్విక జంటగా నటించిన ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అర్జున్ కోలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొంది, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్. కే. ప్రొడక్షన్స్ బ్యానర్లపై వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, మంచి ఎమోషనల్ కనెక్టివిటీతో కూడిన థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాని నిర్మించామని తెలిపారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు లభించిన స్పందన తమలో నమ్మకాన్ని మరింత పెంచిందని, దర్శకుడు అర్జున్ కోలా అనుకున్న కథను ఊహించిన దానికంటే అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చాడని కొనియాడారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా ఒక గొప్ప అనుభూతిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ, మన చుట్టూ సమాజంలో జరిగే యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. కథలో వచ్చే అన్వేషణ తరహా ఘట్టాలు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయని, అలాగే ఇందులో వచ్చే కీలకమైన మలుపు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని, సస్పెన్స్‌తో పాటు సంగీతానికి కూడా పెద్దపీట వేసిన చిత్రమిదని వివరించారు.
ఈ చిత్రానికి భరత్ పట్టి ఛాయాగ్రహణం అందించగా, విప్లవ్ నైషధం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అలాగే భరత్ రోంగలి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. క్రైమ్, మిస్టరీ, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు కలగలసిన తత్వం చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.