సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ స్టార్ కథానాయకి కాజల్ అగర్వాల్ నేటి తరం వివాహ బంధాలు, పెరుగుతున్న విడాకుల సంస్కృతిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న విడాకుల కేసులపై ఆమె స్పందిస్తూ, నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య సహనం నశించడం మరియు సోషల్ మీడియా విపరీతమైన వాడకమే బంధాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణాలని విశ్లేషించారు. దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోవడం వైవాహిక జీవితాల్లో పెద్ద సమస్యగా మారుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
నేటి తరం కపుల్స్ ఒకరి అభిప్రాయాలను మరొకరు వినే ఓపికను కోల్పోతున్నారని కాజల్ వ్యాఖ్యానించారు. చాలామంది జంటలు కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం కేటాయించడం లేదని, హోటళ్లు లేదా డిన్నర్ డేట్స్‌కు వెళ్లినా కూడా చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు పట్టుకుని సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కనిపించే హంగులు, అబద్ధపు ఆదర్శవంతమైన జీవితాలను చూసి తమ సొంత బంధాలను పోల్చి చూసుకోవడం వల్ల దంపతుల మధ్య అసంతృప్తి పెరిగిపోయి చివరికి విడాకులకు దారితీస్తోందని కాజల్ కుండబద్దలు కొట్టారు.
ఇదే క్రమంలో తన వ్యక్తిగత వైవాహిక జీవితానికి సంబంధించిన ఆసక్తికర సూత్రాన్ని కూడా కాజల్ అగర్వాల్ బయటపెట్టారు. తాను, తన భర్త గౌతమ్ కిచ్లూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారంలో కచ్చితంగా ఒక రోజు డిన్నర్‌కు బయటకు వెళ్తామని వెల్లడించారు. ఆ సమయంలో ఫోన్‌లను పూర్తిగా పక్కనపెట్టి కేవలం ఒకరితో ఒకరు సమయం గడుపుతూ మనసు విప్పి మాట్లాడుకుంటామని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడమే ఏ వివాహ బంధానికైనా బలమైన పునాది అని, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడి భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వాలని నేటి యువతకు ఆమె దిశానిర్దేశం చేశారు.
కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు నేటి సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుండటంతో నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాగా సినిమాల విషయానికొస్తే కాజల్ అగర్వాల్ ఇటీవల నాయికగా నటించిన 'ది ఇండియా స్టోరీ' చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. సుదీర్ఘకాలంగా చిత్రపరిశ్రమలో కథానాయకిగా కొనసాగుతున్న కాజల్, సమాజంలోని సున్నితమైన వైవాహిక సమస్యపై ప్రాక్టికల్‌గా స్పందించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.