సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఓటీటీ వేదికగా వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ ప్లాట్‌ఫాం జీ5 తాజాగా మరో ఆసక్తికరమైన సిరీస్‌తో ముందుకు వస్తోంది. మధ్యతరగతి కుటుంబ జీవితంలోని సరదా సంఘటనలు, రోజువారీ గందరగోళాన్ని సహజంగా ఆవిష్కరించిన బకైతి తొలి సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో మరింత ఉత్సాహంగా మేకర్స్ ఇప్పుడు ఈ సిరీస్ రెండో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ కొత్త సీజన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా, సోషల్ మీడియాలో దీనికి విపరీతమైన స్పందన లభిస్తోంది. సెప్టెంబర్ 25 నుంచి ఈ కామెడీ ఎంటర్‌టైనర్ జీ5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ కొత్త సీజన్‌లో కటారియా కుటుంబం మరింత పెద్దదిగా మారి రెట్టింపు వినోదాన్ని పంచనుంది. కథనం ప్రకారం అనుకోని పరిణామాల కారణంగా వేర్వేరుగా ఉన్న కుటుంబ సభ్యులంతా ఒకే ఇంటికి రావాల్సి వస్తుంది. దీనివల్ల ఇంట్లో తలెత్తే చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు, భావోద్వేగాలతో పాటు ఉల్లాసకరమైన వాతావరణం ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని ఇస్తుంది. కేవలం నవ్వులే కాకుండా ఆర్థిక ఇబ్బందలు, కుటుంబ బంధాలు, జ్ఞాపకాలతో కూడిన ఇంటిని కోల్పోయే పరిస్థితి వంటి గంభీరమైన అంశాలను కూడా ఈ సీజన్‌లో స్పృశించారు. రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా, తన్యా శర్మ, ఆదిత్య శుక్లా తదితరులు తమ పాత్రల్లో మరోసారి జీవించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమయ్యారు.
దర్శకుడు సమర్ ఇక్బాల్ ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలను, అనుబంధాలను ఈ సిరీస్‌లో అత్యంత సహజంగా తెరకెక్కించారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని, అక్కడ ఉండే మనుషులు, వారి మధ్య ఉండే జ్ఞాపకాలే అసలైన ఇల్లనే అందమైన భావనను ఈ సీజన్ ద్వారా చాటిచెప్పనున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా చూసేలా రూపుదిద్దుకున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి ఓటీటీలో సందడి చేయనుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.