☼ Suryaa News
🔴 సినిమా తెలుగు సినీ సంగీత చక్రవర్తి 90 వ జయంతి
సినిమా

తెలుగు సినీ సంగీత చక్రవర్తి 90 వ జయంతి

07 Sep 2026 Bangarraju

ఆయన 1970 - 1990 కాలంలో తెలుగు సినీ సంగీతాన్ని శాశించిన చక్రవర్తి. ఆయన పాలనలో పాటలు ఉర్రూతలూగి, పరవళ్లయి పారాయి. సుస్వరాల పల్లకీలో గర్వంగా ఊరేగాయి. శ్రుతిలయలను సవరించుకుని సరాగమాడాయి. ఆయన బాణీలు పడుచుపిల్ల ఓణి వేసుకున్నంత అందంగా, గడుసుపిల్ల అల్లరి చేసినంత మంద్రంగా వుండేవి. ఆయనే స్వర సంగీత చక్రవర్తి గా కీర్తించబడిన శ్రీ కొమ్మినేని అప్పారావు.  (సెప్టెంబర్ 8) ఆ దిగ్గజ సంగీత దర్శకుడి 90 వ జయంతి.

గాయకుడు కావాలని పరిశ్రమకి వచ్చినా, సంగీత దర్శకునిగా వీర విహారం చేసిన చక్రవర్తి దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు పాటకు పెద్ద దిక్కుగా వుండి, కేవలం ఆయన పేరుతో సినిమాలు ఆడిన సందర్భాలు కూడా ఉండేవి. 1970-80 లలో సంచలన విజయం సాధించిన చిత్రాలన్నీ చక్రవర్తి సంగీతాన్ని అందించినవే కావడం ఇందుకు ప్రత్యక్ష తార్కాణం.

చక్రవర్తి పుట్టిన ఊరు గుంటూరు జిల్లా పొన్నెకల్లు, స్వగ్రామంలో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న చక్రవర్తి తాడికొండ, గుంటూరులో మిగతా విద్యనంతా అభ్యసించారు. బీఏ ఎకనామిక్స్‌లో పట్టా, హిందీ విశారద, టైప్‌రైటింగ్‌లో హయ్యర్‌ పాసయ్యారు.

సంగీతం మీద ఆశక్తితో  ఘంటసాల పాడిన కుంతీ కుమారి పద్యాలను లలిత గీతాలను సమయం దొరికినప్పుడల్లా పాడుకునేవారు. మహావాది వెంకటప్పయ్య దగ్గర శిష్యుడిగా చేరినా, శాస్త్రీయ సంగీతం పెద్దగా అబ్బలేదు. అభ్యసించిన సంగీతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గుంటూరులో వాద్య బృందాన్ని ఏర్పాటు చేసి, లలిత గీతాలకు బాణీలు సమాకూర్చి లెక్కకు మించి కచేరీలు చేశారు.

చక్రవర్తి స్వరపరచిన, పాడిన పాటలు విన్న సంగీత దర్శక సోదర ద్వయం రాజన్‌-నాగేంద్ర విఠలాచార్య సినిమాలో పాట పాడే అవకాశం కల్పించారు. అదే సమయంలో గాత్రదానం (డబ్బింగ్) తో సహా సినీ పరిశ్రమ లోని వివిధ శాఖల్లో పని చేశారు. సహాయ దర్శకునిగా వున్న కాలంలో వచ్చిన ఒక అవకాశం మరియు భార్య రోహిణిదేవి సలహా, ప్రోత్సాహంతో సంగీత దర్శకత్వం వైపు పయనించి, "మూగప్రేమ" చిత్రంతో అప్పారావు కాస్తా చక్రవర్తి అయ్యారు. ఆ తర్వాత చక్రవర్తికి తిరుగులేకుండా పోయింది. "శారద" సినిమాతో విఖ్యాతి చెందారు. "ఇదాలోకం" తో తిరుగులేని, తీరికలేని సంగీత దర్శకుడు అయిపోయారు.

చక్రవర్తికి బాణీలు కట్టడం హార్మనియం మెట్ల మీద వేళ్లాడించినంత సులువుగా ఉండేది, బాణీలే కాదు, ఆయన పనిచేసే పద్దతి కూడా అంతే వేగంగా ఉండేది అని ఆయనతో సాన్నిహిత్యం వున్న ప్రముఖులు చెపుతుంటారు, అలా వేల పాటలు తరతరాలు గుర్తుండేలా అవలీలగా రూపొందించారు. ప్రేమభిషేకం సినిమాలోని పాటలను కేవలం ఒకే ఒక్క రాత్రిలో స్వరపరచటం లాంటి సాహసం కేవలం చక్రవర్తికి మాత్రమే సాధ్యం.

మల్లెపువ్వు చిత్రం సంగీత చర్చలు జరుగుతున్న సమయం లో పాట రచన కోసం వేటూరి, స్వర రచన కోసం చక్రవర్తి తెగ ప్రయత్నిస్తున్నారు. రోజులు గడుస్తున్నా సందర్భానికి తగినట్టు ఒక్కటి కూడా రావడం లేదు. వేటూరి గారికి విసుగొచ్చి, "ఒక్క చిన్న ముక్క కూడా రావడం లేదు" అని బాధపడ్డారు. అదే ముక్కని పేపర్‌ మీద పెట్టి చూడండి గురువుగారు అన్నారు చక్రవర్తి. చిన్న ముక్క చిన్న ముక్క అని రాసుకున్నారు వేటూరి. నిమిషం పాటు ఇద్దరు మొహాలు చూసుకున్నారు. ఇద్దరి మొహాల్లో చిరుదరహాసం, వేటూరి వెంటనే దాన్ని మార్చి, "చిన్న మాట, ఒక చిన్నమాట" అన్నారు. అంతే పాట తయారైంది. సరిగ్గా గంటలో స్వరకల్పన కూడా అయింది.

శాస్త్రీయ సంగీతంలో అంతగా ప్రావీణ్యం లేకపోయినా, పలు రాగాలతో చక్రవర్తి చేసిన ప్రయోగాలు అనన్య సామాన్యాలు. మోహన లో ఇదాలోకం చిత్రం లో "నీ మనసు నా మనసు ఏకమై", మాల్‌కౌస్‌, హిందోళం లో జేబుదొంగ చిత్రం లో "రాధా అందించు నీ లేత పెదవి", భీంప్లాస్‌లో "శ్రీమతి గారికి తీరని వేళ", "కుశలమా నీకు కుశలమేనా" కళ్యాణి లో "మన్నించుమా ప్రియా" మాల్‌కౌస్‌, జయజయవంతి, చారుకేశి, సారంగ రాగాల సమ్మేళనంలో "ఆడవే అందాల సురభామిని" లాంటి పాటలు చక్రవర్తి అసమాన ప్రతిభకు కొన్ని మచ్చు తునకలు. చారుకేశి రాగంలో మాస్టర్ వేణుగారి తర్వాత ఎక్కువ పాటలను స్వరపరచి శభాష్ అనిపించుకున్నారు. "ఏటి ఒడ్డున కూర్చుంటే" పాట ఒక్కటి చాలు చక్రవర్తికి చారుకేశి మీదున్న మక్కువ తెలియచెప్పటానికి. క్షణమైనా నిలువని ప్రవాహలక్షణం కలవాడుగా చక్రవర్తిని పోల్చే వారు ఆచార్య సి.నారాయణరెడ్డి.  

సంగీత దర్శకునిగా క్షణం తీరిక లేకుండా వున్న సమయంలోనే  తన నటనాపటిమతో కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగలిగారు. గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, ఆమెకథ, అల్లరి బుల్లోడు, సీతాపతి సంసారం, అతనికంటే ఘనుడు, గజదొంగ మొదలయిన చిత్రాలలో వైవిద్యభరితమయిన పాత్రలలో చక్రవర్తి మెప్పించారు.

చక్రవర్తి సంగీతం ఛందోరాహిత్యంలో ఛందస్సును సృష్టించుకున్న సహజ సాహిత్యం వంటిది. సాహిత్య రాహిత్యంలో సరస హృదయాలను అలరింపగల ఆమని కోయిల తీయని పిలుపు వంటిది అనేవారు ప్రముఖ గీత రచయిత శ్రీ వేటూరి సుందరరామమూర్తి.

వేటూరి కలం పదునేమిటో చక్రవర్తికి తెలుసు. చక్రవర్తి సంగీతం జోరేమిటో వేటూరికి తెలుసు, వేటూరి గడుసరి పాటకు చక్రవర్తి సొగసరి సంగీతం, బాలు - సుశీల - జానకి ల అమృత గళాలు జతకలిసి, దర్శకుల ఆలోచనాసరళికి, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రూపుదిద్దుకున్న పాటలు ఆ కాలాన్ని సంగీత స్వర్ణ యుగంగా మార్చేసాయి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, రాజ్ - కోటి లు చక్రవర్తి సంగీత పాఠశాల నుంచి వచ్చిన ఆణిముత్యాలే.

దాదాపు రెండు దశాబ్దాలు అప్రతిహతంగా సాగిన జైత్రయాత్రలో 960 పైగా చిత్రాలకు స్వరాలనందించిన చక్రవర్తికి వెయ్యి సినిమాలు పూర్తి చేయాలని కోరిక ఉండేది. దురదృష్ట వశాత్తూ ఆ కోరిక తీరకుండానే 2002 ఫిబ్రవరి లో వెళ్లిపోయారు. ఇప్పుడాయన "ఆడవె అందాల సురభామినీ" అంటూ వారి సమక్షంలో, లాస్యానికి తగిన బాణీలు కడుతూ అలరిస్తున్నారు.

-A భరద్వాజ్

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో

🕑 18 Sep 2026
సినిమా

2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’

🕑 18 Sep 2026
సినిమా

ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

🕑 18 Sep 2026
సినిమా

ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

🕑 18 Sep 2026
సినిమా

జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం

🕑 18 Sep 2026
సినిమా

జైలర్ 2 సినిమాలో సూరజ్ వెంజరమూడు పవర్‌ఫుల్ రోల్.. రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్ర రివీల్

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home