☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ *ఆళ్ల నాని హుందాతనానికి ప్రతీక - మంత్రి నారా లోకేష్ నివాళి*
ఆంధ్రప్రదేశ్

*ఆళ్ల నాని హుందాతనానికి ప్రతీక - మంత్రి నారా లోకేష్ నివాళి*

17 Sep 2026 Network

ఏలూరు:రాజకీయాల్లో హుందాతనానికి, రాజనీతికి ప్రతీక ఆళ్ల నాని అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం ఏలూరులోని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్, నాని పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఆళ్ల నాని మంత్రిగా ఉన్నప్పుడు తాను ఎమ్మెల్సీగా ఉన్నానని, సభలో ఎన్నో అంశాలపై చర్చించేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. "ఏనాడూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా ఎంతో హుందాగా వ్యవహరించేవారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండి, ప్రజా సమస్యలపైనే మాట్లాడాలని నమ్మే వ్యక్తి" అని కొనియాడారు.

"ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆళ్ల నాని సేవలు చిరస్మరణీయం. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. లక్ష్మణ రేఖ దాటని వ్యక్తి, క్రమశిక్షణకు మారుపేరు ఆళ్ల నాని. ఆయన లాంటి వ్యక్తులను చూసే మాలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని గతంలో ఆయనతోనే చెప్పాను" అని లోకేష్ పేర్కొన్నారు.

ఆళ్ల నాని కుటుంబానికి టీడీపీ పరంగా, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయని, మంత్రి కొలుసు పార్థసారథి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home