Home | Archives | PDf Paper
 SEARCH: 

సోనియా కాంగ్రెస్‌!

ధరలు విపరీతంగా పెరిగిపోయి దిగి రాకపోవడానికి నిరాకరిస్తూ ఉండడానికి మార్కెట్‌ శక్తులకు విచ్చలవిడిగా స్వేచ్ఛ ప్రసాదిస్తున్న ‘మన్మోహనామిక్స్‌’దే బాధ్యత. వామపక్ష తీవ్రవాదం
రగిలి రాజుకోవడానికీ కారణమదే. మన్మోహన్‌ జోరుగా అమలు చేస్తున్న ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల వల్ల సామాన్య జనం తమకు దూరమయ్యే ప్రమాదం దాపురిస్తున్నదని గ్రహించినందువల్లనేవాటినిప్రతిఘటించే ప్రత్యామ్నాయ స్వరాలను పార్టీలోపలే ప్రోత్సహించడం జరుగుతున్నదనే అభిప్రాయాన్ని త్రోసి పుచ్చలేము.అలాగే జాతీయ సలహా మండలిని పునరుద్ధరించడంలో సోనియా ఉద్దేశం మన్మోహన్‌ విధాన తీవ్రత దుష్ర్పభావాన్ని అవసరమైన మేరకు పరిమితం చేస్తూ పోవడానికే. మంటల మీద నీళ్ళు చిలకరించడం ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికే. సోనియా గాంధీ మొసళ్ళకు మాంసపు ముక్కలు వేయడం ద్వారా నదినిదాటేకళనురక్తికట్టించాలనుకుంటున్నారు. వాటిని చంపటం ద్వారాజలాలను జనహితంగా మార్చడం కాదు ఆమె ఉద్దేశం. అయితే బిజెపి ఆపాటి చాకచక్యం కలది కూడా కాకపోవడం ఆమెకు అయాచిత వరం అవుతున్నది.


సోనియా గాంధీ వరుసగా నాలుగోసారి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టడం వింత గొల్పే విషయం కాదు.దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్‌ పార్టీ విదేశీ మూలాలున్న వ్యక్తి నేతృత్వంలో ఉండడమూ విస్తు పోవలసిన అంశం కాదు. 1885లో ఆ ఆ పార్టీ ఆవిర్భావమే అలాన్‌ ఓక్టేవియన్‌ హ్యూమ్‌ అనే విదేశీ చేతుల మీదుగా జరిగింది. సర్‌ విలియం వెడ్డర్‌బర్న్‌, ఆల్‌ఫ్రెడ్‌ వెబ్‌, హెన్రీ కాటన్‌, అన్నీబిసెంట్‌ వంటి విదేశీయులు ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సోనియా నెహ్రూ కుటుంబం కోడలు. అందుచేత ఇటువంటి వేమీ చర్చనీయాంశాలు కానక్కర లేదు.

స్వాతంత్య్ర పోరాటానికి సారథ్యం వహించిన ఘనతను వారసత్వ సంపదగా చూపించుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ వంశపారంపర్య నాయకత్వాన్ని కూడా భక్తి శ్రద్ధలతో మోస్తున్నది. 2004, 2009 ఎన్నికలలో వరుసగా కాంగ్రెస్‌ను గెలిపించి దేశాధికార పీఠం మీద కొనసాగేలా చేసిన సోనియా గాంధీ ఆ పార్టీకి ఎదురు లేని నేతగా స్థిరపడడం విశేషమే, కాదనలేము. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు ఉపయోగపడిన అంశాలు- ప్రపంచీకరణ, ప్రపంచ బ్యాంకు నిర్దేశిత సంస్కరణల బాటకు బలమైనప్రత్యామ్నాయాన్నిచూపగలశక్తులుఅంతర్జాతీయంగానూ, దేశీయంగానూ అత్యంత బలహీనం కావడం, చతికిల పడిపోయి ఉండడం, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ సైతం అమెరికా అనుకూల భంగిమల ప్రదర్శనలలో, వాటిని రక్తి కట్టించడంలో కాంగ్రెస్‌కు కార్బన్‌ కాపీయే కావడం, బిజెపిని వ్యతిరేకించే మైనారిటీలలో మెజారిటీ తిరిగి కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపించడం- ఇటువంటి కారణాలతో దేశంలోని మధ్యతరగతికి, రైతాంగానికి, మైనారిటీలకు, సంప్రదాయ ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకులకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రీతిపాత్రమైంది. అందుచేత అది వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది.

ఈ క్రమంలో పార్టీకి నాయకత్వ పగ్గాలు చేపట్టి ఉన్న సోనియా గాంధీ ఖాతాలో ఈ విజయాలు చేరడం వాటి శిఖరం మీద నిలబడి ఆమె నాలుగోసారి పార్టీ అధ్యక్షురాలు కావడం జరిగిపోయాయి. పోటీకి అణువంత ఆస్కారం లేని వాతావరణంలో జరిగిన ఆమె ఎన్నిక ఒక తంతు మాత్రమే. అయితే సోనియా గాంధీ తిరిగి పార్టీ నేతృత్వ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్ళ రికార్డు కాలం అధ్యక్ష పీఠం మీద కొనసాగి మరి 40 సార్లయినా ఆమే అధ్యక్షురాలుగా ఉంటారని పార్టీలోని వారి కీర్తనలందుకున్న వేళ ఆమె నాయకత్వంలో యుపిఎ-2 ప్రభుత్వం ఊహించని సవాళ్ళను ఎదుర్కొంటున్నదనే చేదు వాస్తవాన్ని కూడా అంగీకరించక తప్పదు.

సోనియా శైలిలోని నిదానం, ఆచి తూచి అడుగు వేసే తత్వం ఆమెను విఫల నేతగా చూపించడం ఆశ్చర్యపోవలసిన అంశమీమీ కాదు. కాని సమస్యలు తీవ్ర రూపం ధరించేకొద్దీ వాటి పరిష్కారం కోసం మరింత ఓపికగా కృషి చేసే తత్వమూ సోనియాలోనే నిబిడీకృతమై ఉన్నదని అంగీకరిం చక తప్పదు.తాపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనకుండా అవసరానుగుణంగా వ్యూహాలు మార్చుకుని పరిస్థితులు చక్కదిద్దుకోవాలనే విజ్ఞతకు కూడా ఆమెలో కొదువ లేదనవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కుడి, ఎడమల - రెండు దిశల్లోనూ అడుగులు వేసి పరిస్థితి చేయి దాటకుండా చూసుకోగల చాకచక్యం నేడు కాంగ్రెస్‌కు ఉన్నది. నెహ్రూ, ఇందిరాగాంధీ కాలంలో ఆశ్రయించిన వామ కేంద్రక వైఖరి, అనంతరం రంగు మార్చకుండా దిక్కు మార్చినట్టు పట్టిన సంస్కరణల బాట రెండూ దాని అమ్ముల పొదిలో ఇప్పుడు అమరి ఉన్నాయి.

తాజాగా ఒరిస్సాలోని వేదాంత అల్యూమినా విషయంలో వేసిన పిల్లి మొగ్గే ఇందుకు ఉదాహరణ. ఒకవైపు వామపక్ష తీవ్రవాదం పెను సవాలుగా పరిణమించి ఆదివాసీలను కూర్చి దండుకడుతున్న వేళ అంతటి బలమైన వేదాంతకు దుకాణం మూసుకోవలసిందేనని స్పష్టం చేయించి ఆ వెలుగులో రాహుల్‌ గాంధీ పేదల పెన్నిధి అవతారంలో వెలిగిపోయేలా చేయడంకాంగ్రెస్‌కే చెల్లు. వేదాంత ఉదంతంతో మ న్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం పై అమెరికన్లకు, విదేశీ బహుళ జాతి పెట్టుబడిదార్లకు నమ్మకం సడలుతున్నదనే ప్రచారం అప్పుడే ఊపు అందుకున్నది. అయినా మన్మోహనామాత్యుడు గాని, ఆయనను వెన్నంటి ఉన్న పాశ్చాత్య బడా వ్యాపారులు గాని భయపడవలసిన పనిలేదు. లెఫ్టు, రైటు రెండూ సమపాళ్ళల్లో సమయానుకూలంగా రక్తికట్టించగల నేర్పరులు కాంగ్రెస్‌ వ్యూహ కర్తలు.

పేట్రేగి ఫెళపెళార్భాటాలతో ఉరుములు, పిడుగులై సామాన్యుడిని కాల్చుకు తింటున్న అధిక ధరలు గాని, కాశ్మీర్‌ సమస్య గాని, వామపక్ష తీవ్రవాదం గాని సోనియా నాయకత్వంలోని యుపిఎ 2 ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మాట వాస్తవం. కాశ్మీర్‌లో బలగాల కేంద్రీకరణను తగ్గించడం ద్వారా, రాజ్యాంగ పరిధులకు లోబడి కొన్ని స్వతంత్ర, స్వయంపాలనాధికారాలు ఇవ్వడం ద్వారా మాత్రమే ఆ రాష్ట్ర ప్రజలను తిరిగి ఆకట్టుకోవడం సాధ్యమనే యోచన యుపిఎ పాలకులలో అంకురించినా దానిని ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదు. అయినా అటువైపే అడుగులు వేయదలచుకున్నట్టు కనిపించి పరిస్థితిని దారికి తెచ్చుకోగల సమర్ధత కాంగ్రెస్‌కు లేదనుకోలేము.

ధరలు విపరీతంగా పెరిగిపోయి దిగి రాకపోవడానికి నిరాకరిస్తూ ఉండడానికి మార్కెట్‌ శక్తులకు విచ్చలవిడిగా స్వేచ్ఛ ప్రసాదిస్తున్న ‘మన్మోహనామిక్స్‌’దే బాధ్యత. వామపక్ష తీవ్రవాదం రగిలి రాజుకోవడానికీ కారణమదే. మన్మోహన్‌ జోరుగా అమలు చేస్తున్న ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల వల్ల సామాన్య జనం తమకు దూరమయ్యే ప్రమాదం దాపురిస్తున్నదని గ్రహించినందువల్లనే వాటిని ప్రతిఘటించే ప్రత్యామ్నాయ స్వరాలను పార్టీలోపలే ప్రోత్సహించడం జరుగుతున్నదనే అభిప్రాయాన్ని త్రోసి పుచ్చలేము. అలాగే జాతీయ సలహా మండలిని పునరుద్ధరించడంలో సోనియా ఉద్దేశం మన్మోహన్‌ విధాన తీవ్రత దుష్ర్పభావాన్ని అవసరమైన మేరకు పరిమితం చేస్తూ పోవడానికే. మంటల మీద నీళ్ళు చిలకరించడం ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికే. సోనియా గాంధీ మొసళ్ళకు మాంసపు ముక్కలు వేయడం ద్వారా నదిని దాటే కళను రక్తికట్టించాలనుకుంటున్నారు. వాటిని చంపటం ద్వారా జలాలను జనహితంగా మార్చడం కాదు ఆమె ఉద్దేశం. అయితే బిజెపి ఆపాటి చాకచక్యం కలది కూడా కాకపోవడం ఆమెకు అయాచిత వరం అవుతున్నది.
More From Editorial
SURYA Specials |
Weekly Specials |
Advertisement477
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us