
మమత రైలు ..ఏదాది లేటు ..!
న్యూఢిల్లీ : రైల్వే శాఖమంత్రి మమతాబెనర్జీ ఈసారైనా యావత్ దేశాన్ని పరిగణలోకి తీసుకుంటారా...? బెంగాల్‌పైనే కరుణ చూపుతారా..? అనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి. తన రాష్ట్రానికే కేటాయించిన పలు ప్రాజె క్టులు సైతం కేంద్ర కేబినేట్ ఆమోదానికి నోచుకోలేదు. దీంతో ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మమత మన రాష్ట్రంపై ప్రేమ కురిపిస్తారో...? లేక మొండిచేయి చూపిస్తారోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమతకు పశ్చిమబెంగాల్‌పై ప్రత్యేకమైన మక్కువ ఉన్న విషయం చెప్పనవసరం లేదు. డిసెంబర్ 30న ముపె్ఫై ఐదు కొత్త ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టారు. వాటిలో ఏడు సూపర్‌ఫాస్ట్ డూర్నోటో ఎక్స్‌ప్రెస్‌లు, ఒక యువ ఎక్స్‌ప్రెస్ రైలు కొత్తగా ప్రవేశపెట్టారు. మరో 17 రైళ్ల ప్రయాణాన్ని పొడిగించారు.
8 రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచారు. బడ్జెట్‌లో ప్రకటించినట్లు వారాంతాల్లో రైల్వే మౌలికసదుపాయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటామని గొప్పలు చెబుతారు. వాస్తవానికి ఈ కార్యక్రమాలు ఫంక్షన్‌లకే పరిమితం. ఫం క్షన్‌లు పూర్తికాగానే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉం టాయి. మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటి వరకు పచ్చజెండా ఊపలేదు. గత వారమే కొన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా కంచ్రాపారా -హలీషహర్ కోచ్‌ఫ్యాక్టరీ ఇది కోలకతా సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు దీనిపై మమతా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. గత ఎనిమిది నెలల నుంచి దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించినా, వచ్చే వారం మాత్రమే కేంద్ర కేబినెట్ అనుమతి కోసం నివేదికను సమర్పిస్తారు.
న్యూఢిల్లీ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లను మోడల్ రైల్వేస్టేషన్లుగా తీర్చిదిద్దాలని ప్రణాళిక రచించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఇదే మోడల్ రైల్వేస్టేషన్ల ను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి పురోగతి లేదని అధికారులు చెబుతున్నారు. కోల్‌కతాకు చెందిన వ్యాగన్ తయారీ కంపెనీ టేకోవర్ ప్రతిపాదన కేవలం కాగితాలకే పరిమితమయింది. దీనికి కేబినెట్ అనుమతి రావాలి. దీనికి సంబంధించి వచ్చే 15, 20 రోజుల్లో కేబినెట్ ఆమోదానికి పంపుతారని తెలుస్తోంది ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీనికి అనుమతి లభించవచ్చునని రైల్వే అధికారులు ఆశాభావంతో ఉన్నారు.
దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి 50 రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశారని అధికారులు తెలియజేశారు.
అవి ఆచరణకు నోచుకోలేదు. ‘కిసాన్ విజన్’ ప్రాజెక్టుకు సన్నాహాలు చేశారు హరిత విప్లవానికి రైల్వే చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించాలనుకు న్నారు. అది కార్యరూపం దాల్చలేదు. గత నవంబర్‌లో రైల్వే మంత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌లోని సింగూరులో రైల్వే లింకు ద్వారా శీతలగిడ్డంగి ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించి భవిష్యత్తు బ్లూప్రింటు ఏర్పాటు కాలేదు. కిసాన్ విజన్ ప్రాజెక్టు కింద ఈ ప్రాజెక్టును తయారు చేశారు.
ఈ ప్రాజెక్టులే కాకుండా కొత్తకొత్త స్కీంలు అత్యవసరంగా తెరపైకి తీసుకువచ్చారు. వీటిలో ప్రధానంగా మొబైల్ టికెటింగ్ వాన్ స్కీం, దీనిని ‘ముష్కిల్ -ఆసాన్’ను జనవరిలో ప్రతిపాదన చేశారు. గత వారం రైల్వే మంత్రిత్వశాఖ కేంద్ర ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖతో ఒక మెమొ రాండం ఆఫ్ అగ్రిమెంట్ (ఎంవోయు) కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌కు ఈ శాఖలు సహాయ సహకారాలందిస్తాయి. ఈ స్కీం వివరాలన్నీ గత సంవత్సరం బడ్జెట్‌లో మమతా బెనర్జీ ప్రవేశపెట్టారు.
రైల్వే ఆదాయంలో ఎనిమిది శాతం పెరుగుదల
రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేవలం ఒక వారం సమయం ఉండగా, రైల్వేమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో జనవరి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో 8 శాతం పెరుగుదలను నమోదు చేసి రూ.70,501.65 కోట్లు ఆర్జించిందని, గత సంవత్సరం ఇదే కాలానికి రూ.64.943.32 కోట్లని సీనియర్ రైల్వేఅధికారులు వెల్లడించారు. రైల్వే బడ్జెట్ ఫిబ్రవరి 24న ప్రవేశపెడతారు. రైల్వే నెట్‌వర్క్, రైల్వే మౌలిక ప్రాజెక్టుల కొరకు పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రాజెక్టులు చేపట్టబోతామని ఆయన చెప్పారు. సరకు రవాణా ద్వారా రూ.44,035.66 కోట్లు నుంచి రూ.47,763.29 కోట్లు ఆర్జించినట్లు, ప్రయాణికుల ద్వారా రూ. 18,057.41 కోట్ల నుంచి 19,392.26 కోట్లకు ఆదాయం పెరిగిందని ఆయన తెలియజేశారు. సరకు రవాణా ద్వారా 8.47 శాతం, ప్రయాణికుల ద్వారా 7.40 శాతం సాధించామని ఆయన వివరించారు. పది నెలల కాలానికి మొత్తం 62వేల కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారని, అంతకు ముందు సంవత్సరం సుమారు 60వేల కోట్ల మంది ప్రయాణించారని ప్రయాణికుల సంఖ్యలో 4.59 శాతం పెరుగుదల నమోదైందని ఆయన పేర్కొన్నారు.


























































