
గాంధీ బాటలో నడిచి... పేదల కోసం శ్రమించి ...
‘బాబా ఆమ్టే చనిపోయి స్వర్గానికి చేరుకున్నారు... అక్కడ ఆయనకు గాంధీజీ ఎదురయ్యారు. స్వర్గం ఎలా ఉందని గాంధీని ప్రశ్నించారు ఆమ్టే.... నువ్వు భూలోకంలో నిర్మించిన దానితో ఈ స్వర్గానికి పోలికా? అని ప్రశ్నించారు గాంధీ. బాబా ఆమ్టే మరణం తర్వాత ఓ ప్రముఖ కార్టూనిస్టు గీసిన చిత్రంలోని సారంశమిది.... ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆమ్టే గురించి చెప్పు కోవడానికి. నాలుగు డబ్బులు కళ్లపడగానే ఏ విధంగా జల్సా చేయాలి... వాటిని తరువాతి తరాలకు ఎలా అందించాలని ఆలోచిస్తాం. కానీ ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కోసం జీవితాంతం కృషి చేసిన మహా మనీషి ఆయన. సన్నిహితులందరూ బాబాగా పిలుచుకునే మురళీధర్ దేవదాస్ ఆమ్టే కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారాడు. వారి కోసం ఆశ్రమాన్ని స్థాపించి తన శేష జీవితాన్ని అక్కడే గడిపిన మహనీయుడు... గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై చివరి వరకు ఆయన బాటలో నడిచారు.అణవారిన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం తపించిన ఆమ్టే వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం....
బాబా ఆమ్టే డిసెంబర్ 26, 1914న మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింఘన్‌ఘాట్ లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే ఆయనను అందరూ ముద్దుగా బాబా అని పిలిచేవారు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరు గుతుండేది.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టయిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు.క్రమ క్రమంగా మహాత్మా గాంధీ వైపు ఆకర్షితుడయ్యాడు. గాంధీజీతో పాటు కొంత కాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడ్డాడు. వేషధారణలో కూడా గాంధీజీలా ఖద్దరు దుస్తులనే ధరించాడు. గాంధీజీలా జీవితాంతం అణగారిన వర్గాల కృషి కోసం పాటుపడ్డాడు. 1946లో బాబాఆమ్టే సాధన గులేశాస్ర్తిని వివాహం చేసుకున్నాడు. ఆమెనంతా సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అంతే పెద్దక్క) గా పిలువబడింది. వీరికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవ కోసం పాటుపడుతున్నారు.
ఆనంద్‌వన్ : బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహా రాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించారు. ఆనంద్‌వన్ అంటే ఆనందపు అడవి అని అర్ధం. వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించారు. అది క్రమక్రమంగా పెద్దదై 500 ఎకరాలకు విస్తరించింది. ఆ రోజుల్లో కుష్టురోగులను సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కోసం ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం.
కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను తిప్పికొట్టేవారు. ఆయన స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు. కుష్టురోగుల కోసం బాబాఆమ్టే తదనంతరం సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించారు. సమాజసేవ విషయంలో ఆనంద్‌వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్‌వన్ చేస్తున్న సేవలకుగాను బాబాఆమ్టేకు 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థనుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్‌వన్ రెండు ఆసుపత్రులను, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక అంధుల పాఠశాలను, అనాథశరణాలయాన్ని నడిపిస్తోంది. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 5000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారంటే ఆయన చేసిన కృషి ఎలాంటిదో మనకు అర్ధమవుతుంది. గాంధీజీ సిద్ధాంతాలు :
బాబాఆమ్టే గాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి . అది మాత్రమే కాకుండా ఆ సిద్ధాంతాలను పూర్తిగా ఆచరించిన మహనీయుడు. గాంధీజీతో పరిచయమైన తరువాత అతనితో పాటు కొద్ది రోజులు సేవా గ్రం ఆశ్రమంలో గడిపి గాంధీజీ శిష్యుడిగా మారి, అతని సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్నాడు. ఆ సమయంలోనే గాంధీజీ బాబాఆమ్టేకు అభయసాధక్ అనే బిరుదు ఇచ్చాడు. కుష్టురోగులకు భయపడక వారి సంక్షేమానికి ఇతను చేస్తున్న కృషి ఫలితమే ఆ బిరుదు. ఆ తరువాత బాబాఆమ్టే సిద్ధాంతాలపై కూడా గాంధీజీ ప్రభావం చాలా పడింది. శేషజీవితం అణగారిన వర్గాల కోసం గడపడమే కాకుండా, వస్తధ్రారణలో ఖద్దరు బట్టలనే ధరించడం ఇత్యాది విషయాలలో ఆ ఇద్దరిలో సామ్యముంది. అంతేకాదు ఆమ్టే ఆశ్రమాల్లో గడుపుతూ పూర్తి శాఖాహార భోజనం చేస్తూ జీవించాడు. గాంధీజీలా గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించేవాడు. గాంధీజీ బ్రిటీష్ వారిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబా ఆమ్టే కూడా నర్మదా బచావో ఉద్యమంలో ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించాడు.మరణం :
2008, ఫిబ్రవరి 9 ఉదయం 4.15 గంటలకు తన ఆశ్రమం ఆనంద్‌వన్‌లో బాబా ఆమ్టే కన్నుమూశాడు. 94 సంవత్సరాల వయస్సు ఉన్న బాబా ఆమ్టే చాలా కాలం నుంచి వెన్నుపూస సమస్యతో బాధపడేవాడు. ఆయన చివరిదశలో రక్తకాన్సర్‌తో బాధ పడ్డారు. అయినా తుదిశ్వాస వదిలే వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకే పాటుపడి, తన ఆశయమే లక్ష్యంగా కృషి చేశాడు. ఫిబ్రవరి 10న అధికార లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. భౌతికకాయాన్ని దహనం చేయడానికి బదులు ఆయన అంతిమ కోరిక మేరకు ఖననం చేశారు. అనేక దశాబ్దాల పాటు దీనజన ప్రజల కోసం కృషి చేసిన బాబా ఆమ్టేకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అవార్డులతో పాటు లభించిన నగదును సైతం సాంఘిక కార్యకలాపాల కోసమే వినియోగించాడు. 1971 : భారత ప్రభుత్వపు పద్మశ్రీ అవార్డు.
1974 : మహారాష్ట్ర ప్రభుత్వపు దళిత్ మిశ్రా అవార్డు.
1978 : రాష్ట్రీయ భూషణ్ అవార్డు.
1979 ; జమ్నాలాల్ బజాజ్ అవార్డు.
1983 : అమెరికాకు చెందిన డామియెన్ డట్టన్ అవార్డు (కుష్టువ్యాధి పీడితుల కోసం కృషి చేసిన వారికిచ్చే ప్రపంచంలో అత్యున్నత అవార్డు).
1985 : రామన్ మెగసేసే అవార్డు.
1985 : మధ్య ప్రదేశ్ ప్రభుత్వపు ఇందిరా గాంధీ స్మారక అవార్డు.
1986 : భారత ప్రభుత్వపు పద్మవిభూషణ్ అవార్డు.
1986 : రాజారామ్‌మోహన్ రాయ్ అవార్డు.
1988 : ఐక్యరాజ్య సమితి మానవహక్కుల అవార్డు.
1988 : జి.డి.బిర్లా అంతర్జాతీయ అవార్డు.
1988 : ఫిక్కి అవార్డు.
1989 : అంతర్జాతీయ జిరాఫీ అవార్డు.
1990 ; టెంపుల్టన్ అవార్డు.
1991 : రైట్ లివ్లీహుడ్ అవార్డ్ (ఈ అవార్డు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందింది)
1991 : ఆదివాసీ సేవక్ అవార్డు.
1992 : మహారాష్ట్ర ప్రభుత్వపు అంబేద్కర్ దళిత్ మిత్ర అవార్డు
1997 : మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ అవార్డు.
1999 : గాంధీ శాంతి బహుమతి.
1999 : అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు.
2008 : భారత్‌వాసా అవార్డు.
కె. అరుణ్ కుమార్
Other News From Colours


























































