
కూటి కోసమొచ్చి... కూలిపోతున్నారు
పొట్టకూటి కోసం జెర్రిపోతులాట అనే మాటెలా ఉన్నా కడుపేదరికంలో మగ్గుతున్న ప్రజలు మాత్రం భారమైన బ్రతుకు బండిని లాగడానికి బండచాకిరీ చేయడమే కాదు అర్థంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. వారిలో భవన నిర్మాణ కార్మికులది ముందు వరుస. వలస జీవనం సాగిస్తూ అడ్డా కూలీలుగా మారుతున్న పొరుగు జిల్లాల పేదల పరిస్థితి గ్రేటర్ మహా నగరంలో నిత్యం మృత్యుకేళితో సహజీవనం చేయిస్తోంది. అదృష్టం బాగా లేకపోతే కార్మికులు పని చేస్తున్న చోటనే ప్రాణాలు హరీమంటున్నాయి. శుక్రవారం జరిగిన నారాయణగూడ దుర్ఘటనలో అడ్డా కూలీలు ప్రాణాలు వదిలారు. కార్మిక చట్టాలు... భీమా పథకాలు అంటూ పేదోళ్ళ ఓట్ల కోసం రాజకీయ నాయకులు గారడీ చేస్తుంటే... గెలిచే వారి ఆజమాయిషిలో ఇంజనీరింగ్ , టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఫలితంగా పేదల బ్రతుకులు నిర్మాణ తదితర పనుల్లోనే తెల్లారి పోతున్నాయి. పదుల సంఖ్యలో అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వ ప్రకటనలు... ఆ తరువాత చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి.
ఇక వలస జీవులకు ఇక్కడ ప్రాణ భద్రత అసలు లేకుండా పోయింది. భవన నిర్మాణ కార్మికుల్లో భాగమైన సెంట్రింగ్ కార్మికుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. భవన నిర్మాణ, సెంట్రింగ్ కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం స్పందిస్తున్న తీరు పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. మరణించే కార్మికుల కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోతుంది తప్ప ప్రభుత్వపరంగా అందుతున్న ఆదరణ అంతగా కనిపించడం లేదు. ప్రమాదాలు జరుగుకుండా చర్యలు మాత్రం భవన నిర్మాణదారులు, ఇంజ నీర్లు తీసుకునే విధంగా ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదని కార్మి కులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో దినసరి కూలీలుగా పరిశ్రమల్లో పని చేస్తున్న వారి బ్రతుకులకు అసలు ‘సేఫ్టీ’ లేకుండా పోయింది. రోగాలు వస్తే బీమా సౌకర్యం లేనట్లే కార్మికులు పరిశ్రమల్లో చనిపోయిన వారి కుటుంబాలను పూర్తి స్థాయి లో ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలుగా పరిశ్రమల్లో పని చేస్తున్న మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల వలస కార్మికులు దినదినగండంగా కాలం వెళ్ళదీస్తున్నారు. ఫలితంగా ఊరు కాని ఊరు నుంచి పొట్ట చేత పట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ వీరు చేసే పనుల్లో ఒక్కోసారి ప్రాణాలు హరీ అంటున్నాయి.
కార్మికులు మృత్యువాత పడిన విషయం బయటకు తెలిస్తే కంటితుడుపు చర్యలుగా నష్టపరిహారాన్ని చెల్లించి చేతులు దులుపుకుంటున్న యాజ మాన్యాలే అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు మూడు రోజుల క్రితం ఆరాంఘర్ వద్ద ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమలో పని చేస్తున్న ఒరిస్సాకు చెందిన కార్మికులు యంత్రానికే తన ప్రాణాలు అర్పించాడు. బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన రమేష్ అనే కార్మికుడు భవన నిర్మాణ పనులు చేస్తూ ఇటీవల బేగంబజార్‌లో మరణించాడు. భవానీ కాలనీలో అంతస్తు పైన గోడ కడుతూ రవి అనే మేస్ర్తీ కిందపడి మరణిం చాడు. ఇలా నిత్యం రాష్టవ్య్రాప్తంగా అనేక దుర్ఘటనలు చోటు చేసుకుంటూనే ఉండటం విషాదకరం.
ఉన్న ఊరిలో తిండి కరువు... నమ్ముకున్న నగరంలో నరకం
ఉన్న ఊరిలో తిండి కరువాయో.... నమ్ముకున్న నగరమేమూ నరకమే చూపించబట్టే తామేలా బతికేదని రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట మండలం అర్కతల గ్రామానికి చెందిన రాజన్న ఆవేదన చెందాడు. మాకు పొలాలు న్నాయి అయినా అక్కడ నీళ్లు లేక బతుకుదెరువు కోసం గత పదేళ్ల క్రితం నగరానికి వచ్చి జీవిస్తున్నాం. ఏనాడు కడుపు నిండా తిన్న రోజులు లేవు. చేతినిండ పనిదొరికినప్పుడే కడుపునిండ అన్నం. లేదంటే మాకు ఉపవాసాలే మాకు అని అడ్డా కూళీ రాజన్న తెలిపాడు. మాకు వ్యవసాయానికి సరిపడే నీళ్లు అందించినా మా జీవితాలు పచ్చని పైర్లే అని బదులిచ్చాడు రాజన్న.డబ్బులేకే నా భార్య చనిపోయింది : యం.తిరుపతయ్య (కొత్తకోట)
నేను రోజు కూలిచేసుకుంటేనే నా కూతుళ్లను సాకగలను లేకపోతే పస్తులుం డక తప్పదు. రోగం వచ్చినా నొప్పివచ్చినా మా కష్టాలకు ఆగుడుండదు. ఎందుకంటే మా బతుకులే ఇంత అని పాలమూరు జిల్లా కొత్తకోట మండలం కన్నివేట గ్రామానికి చెందిన తిరుపతయ్య బోరున విలపించాడు. నిత్యం కూళీ దొరకకపోవడంతో భార్యను బ్రతికించుకోలేక పోయానని చెప్పాడు. తినడానికే తిండిలేక ఆరోగ్యం బాగాలేని భార్య, పిల్లలకు పెట్టలేక చనిపోయిందని అన్నాడు. అడ్డామీద కూళీలుగా పనిచేసినా అక్కడా కూడా పనిచేయడానికి తక్కువ డబ్బులు తీసుకుంటే వారినే తీసుకుపోతున్నారు. దీంతో ఇక్కడ కూడా మాకు పోటీ పెరిగిపోయిందని అన్నాడు. ఇన్నీ ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మాత్రం మార్చలేకపోయారని తిరుపతయ్య ఆవేదన చెందాడు.మాబోటి గరీబోల్లంటే అందరికి అలుసు : ఎం.డి.ఇమాంసాబ్
నేను నగరానికి వచ్చి ఇరవైఏళ్లుదాటింది అయినా మా కోసం సర్కారోల్లు ఏమి చేయలేదని గుల్బర్గ మండలం ఇమడాపురం గ్రామానికి చెందిన ఎం.డీ ఇమాంసాబ్ అన్నాడు. మా బోటి గరీబోల్ల కోసం పట్టించుకునే నాథుడేలేడని ఏదైనా రోగం వచ్చినా ధర్మాసుపత్రికి వెళ్లినా అక్కడా లంచాలు లేనిదే పని జరగదు. మాకు రోజు పనిచేస్తే 150 రూపాయలు ఇస్తున్నారు. ఎప్పుడు పనిదొరుకుతుందో తెలియదు అయినా సమస్య వస్తే మాత్రం డబ్బులు లేనిదే తీరదు. కుటుంబాన్ని నడిపించే వానికే ఏదైనా సమస్య వస్తే ఆ ఇళ్లు ఆకలిమంటలతోనే శ్మశానవాటికగా మారుతుందని ఆవేదన చెందాడు. మాలాంటి గరీబొళ్లంటే అందరికి అలుసే పట్టించుకునే వారే లేరని అన్నాడు.ఉదయమైయ్యిదంటే చాలు అడ్డాపైనే మా బతుకులు
ఉదయమయ్యిందంటే చాలు పోటాపోటీగా అడ్డామీదకు వచ్చి ఏ సారూ పనికి పిలుస్తాడోనని ఎదురుచూస్తుంటామని పాలమూరు జిల్లా మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామానికి చెందిన బాలయ్య అన్నాడు. గత పదిహేను సంవత్సరాల క్రితం నగరానికి వచ్చినా తమ కుటుంబంలో మాత్రం ఎలాంటి మార్పులేదని తెలిపాడు. అడ్డామీదకు వచ్చి కూర్చుంటే ఏదైనా పనిదొరికితేే చాలు అనం దంతో గెంతులేస్తాం. కాని అక్కడకు తీసుకుపోయిన తర్వాత చేతకాని పను లను కూడా చేయిస్తారు ఇదేమిటంటే డబ్బులు కావాల వద్దా అని బయపెట్టి చేయిస్తారు. తప్పనిసరి పరిస్థితులల్లో చేతకాని పనిచేస్తే రానిరోగాలు వస్తున్నాయి. నిత్య కూలీలేమో వంద రూపాయాలున్నాయి. నిత్యావసర ధరలేమే రెండొందల వరకు అవుతున్నాయి. దీంతో పచ్చికారంతోనే మా బతుకులు నడిపిస్తున్నామని బాలయ్య అవేదన చెందాడు. కూలీ పనిచేసేవాడంటే ప్రతి ఒక్కరికి లోకువే ఎందుకంటే చెప్పింది చేయాలే లేదంటే పనిలేదని చెప్పడం. ప్రభుత్వం మాబోటి వారి కోసం ప్రత్యేకంగా ఏమైన పథకాలు పెట్టాలని బాలయ్య కోరాడు.ఎక్కడుంది మాకు భద్రత : నాగేష్ ( మేస్ర్తీ)
భవన నిర్మాణ మేస్ర్తీలు, కూలీలకు నిర్మాణ సంస్థలు ఏలాంటి భద్రత చర్యలు కల్పించడం లేదని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలస వచ్చి కాటేదాన్ ప్రాంతంలో పని చేస్తున్న నాగేష్ అనే తాపీ మేస్త్రీ ఆవేదన వ్యక్తం చేశాడు. కూలీ పని ప్రతి రోజు లభించా లంటే నిర్మాణ దారులు ఏలాంటి భద్రత చర్యలు తీసుకోకున్నా తాము పనిచేయాల్సి వస్తుందన్నారు. కట్టెలతో ఏర్పాటు చేసుకునే గోవ పై పొద్దంతా నిలబడి తాపీ తిప్పితేనే తిండి అంటూ ధీనంగా చెప్పాడు. ప్రతిచోట భవన నిర్మాణ ప్రాంతాల్లో కార్మికులకు సేఫ్టి కిట్లు ఇవ్వాలని ఆయన కోరాడు.ఏం చేతు బిడ్డ పార కలిపితేనే మాకు బువ్వ : సానమ్మ
భవనాలు లక్షల.. కోట్ల రూపాయల పెట్టి నిర్మింస్తున్నా అడ్డా కూలీలమైన మేము సిమెంట్ మాల్ కలిపేందుకు పారపడితేనే బువ్వ లేకుంటే పస్తులుండాల్సిందేనని మెదక్ జిల్లా సరిహద్దు కర్ణాటక నుంచి వలస వచ్చిన సానమ్మ అనే మహిళా పారకూలీ పేర్కొంది. నెత్తిన తట్ట పెట్టుకుని ఎన్ని అంతస్తులైనా తాత్కాలికంగా కట్టె తడకలపై నుంచి నడుస్తూ తీసుకువెళ్లాల్సిందే. ఆ సమయంలో కాలుజారి పడితే మా ప్రాణాలు పోతాయి. మా గురించి పట్టించుకునేదెవరు. కాంక్రీట్ వేసే సమయాల్లో మరీ ఇబ్బందిగా ఉంటుంది.మా బ్రతుకులు దుర్భరం : నారాయణరెడ్డి(మేస్త్రీ)
అడ్డా కూలీలకంటే దుర్భరంగా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి నెలకొందని బాబుల్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న పాలమూరు జిల్లాకు చెందిన నారా యణ అనే తాపీ మేస్త్రీ ఆవేదన వ్యక్తం చేసాడు. బిల్డింగ్ కూలిపడినా...గోవా మీద నుంచి కిందపడిన కార్మికులే ప్రాణాలు వదిలేది. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే అధికారులు మాముళ్ళ మత్తులో మూలుగుతున్న కారణ ంగా కాంట్రాక్టర్లు ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు కల్పించకుండానే తమ తో పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వక్తం చేశాడు. భవన నిర్మాణ కార్మికుల పేర్లు నమోదు చేయడంతో పాటు ఏ రోజు ఎక్కడకు కూలీ పనికి వెలుతున్నారూ..? ఆ పని వద్ద భద్రత ఉందా లేదా అన్న అంశాలను అధికా రులు నిర్ధారించాలి. ఆ తరువాతే కార్మికులను పనుల్లోకి తీసుకోవాలి. అలా చేయని నిర్మాణదారుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు.కూలీ బ్రతుకులు చిధ్రమవుతున్నాయి: గద్దెయా దగిరి
మునిసిపల్ అధికారుల అనుమతులు లేకున్నా ... అనుమతులు తీసుకున్నా నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇంజనీర్లు చేపడుతున్న నిర్మాణాలు అమా యక కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని భవన నిర్మాణ పనుల కాంట్రాక్టర్ అయిన మార్కండేయనగర్‌కు చెందిన గద్దెయాదగిరి ఆవేదన వ్యక్తం చేసాడు. అక్రమ బిల్డింగ్‌ల నిర్మాణాల తాలుకు అమ్యామ్యాలు ముడితే అధికారులు ఏమీ పట్టించుకోరనే ఆరోపణలకు నారాయణగూడ దుర్ఘటనతో తేటతెల్లంగా కనిపిస్తోందని అన్నాడు.పనులు కాంట్రాక్టు తీసుకుని చేస్తే నాలుగు రాళ్ళు సంపాదిస్తామనే కానీ.. ఇంజనీర్లు తీసుకునే నిర్ణయాలకు అను గుణంగా సేఫ్టి లేని పనులు చేయడం తలకు మించిన భారంగా మారుతుం దన్నాడు. అసలు భవన నిర్మాణం చేసే సమయంలో అధికారులు తనిఖీలు నిర్వహించరా? కేవలం ప్రభుత్వ పనుల్లోనే నాణ్యతా ప్రమాణాలను చూడా లన్న నియమం ఉందా? అలాగైతే ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థలు నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణ సమయంలో నిర్మాణాలు కూలిపోయినా... కార్మి కులు జారిపడినా.. మృత్యువాత కార్మికులు పడాల్సిందేనా..? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ ఉన్నతమైన చర్చ జరిపి ముందుకాలంలో భ వన నిర్మాణ కార్మికులకు ప్రాణ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశా రు. లేని పక్షంలో కార్మిక లోకంతో కలసి ఉద్యమిస్తామన్నారు.
కూలీలైతే కుక్క బ్రతుకులు కావాల్సిందేనా : కుర్మయ్య
ఆ దేవుడే భవన నిర్మాణ కార్మికుల పాలిట రక్షణగా పని చేసే సమయాల్లో నిలవాల్సిన దుస్థితి నెలకొందని ఎపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం రం గారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుర్మయ్య అన్నారు. నారాయణగూడలో జరిగిన దుర్ఘటన విషయంలో ప్రభుత్వ తీరు పట్ల ఆయన మండిపడ్డారు. భవన శిథిలాల కింద మరణించిన మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అక్రమంగా అనుమతులిచ్చి పదుల సంఖ్యలో కూలీల మరణా లకు కారకులైన ముని సిపల్ అధికారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.సమస్యల సుడిగుండంలో భవన నిర్మాణ కార్మికులు....
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సుమారు రెండు లక్షల మంది కార్మికులు సమస్యల సుడిగుండంలో తల్లడిల్లుతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా ఒక భవనం వద్ద పనికి చేరిన తర్వాత ఆ కార్మి కుడు పలు రకాల సమస్యలను ‘మోయ’వలసి వ స్తోంది. నగరంలో అంతు బట్టని విధంగా నిర్మి స్తున్న ఆకాశహర్మ్యాలను ఈ బడుగు జీవి తన కష్టంతో నిర్మిస్తున్నప్పటికీ తగిన ప్రతిఫలం లభించడంలేదు. ఒకరోజు మేస్ర్తీగా పనిచేస్తే 350 రూపాయలు, సహాయకులుగా పనిచేసేవారికి 150-200 రూపాయల వరకు కూలీ లభిస్తున్న ప్పటికీ అవి వారికి సరిగా అందక పలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. పనిచేసే సమయంలో కింది నుంచి పైకి ఎన్ని అంతస్తులు ఉన్నప్పటికిని అంత ఎత్తు బరువైన ఇటుకలు, ఇసుక, కంకర, సిమెంటు, ఐరన్ వంటి ఇతర సామాగ్రిని మోసుకుపోవలసి వస్తున్నందున వారి ఆయుష్షు తగ్గి పలురకాల వ్యాధులకు గురికావలసి వస్తుంది.నిర్మించేది బహుళ అంతస్తులు.... ఉండేది పూరి గుడిసెలు.....
భవన నిర్మాణ రంగంలో లక్షలాది మంది కార్మికులు నిర్మించేది పటిష్టమైన బహుళ అంతస్తులు అందమైన నిలయాలు అయినప్పటికీ వారు మాత్రం నివాసం ఉండేది పూరిగుడిసెల్లో మాత్రమే. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా, ఎక్కడ కొత్త నిర్మాణాలు జరుగుతున్నా అక్కడ గుడారాలు వేసుకుని ఉండే ఈ కార్మికులు దర్శనమిస్తారు. వీరు నివాసం ఉండే ప్రాంతాలు ఎండకు ఎం డుతూ, వానకు తడుస్తూ కనీస సదుపాయాలు లేక ధీనావస్తలో ఉంటాయి.ఢీలాపడ్డ నిర్మాణరంగం... దిక్కులేని కార్మికులు....
గత కొన్ని రోజులుగా నగరంలో భవన నిర్మాణరంగం ఢీలాపడడంతో ఈ రంగంలో పనిచేసే కార్మికులు దిక్కులేక ఇతర రంగాలవైపు మొగ్గుచూ పుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగం మీద ఆధారపడి పనిచేసిన కార్మికులు నిర్మాణ రంగం నత్తనడకన నడుస్తున్నందున పని దొరకక, కొంత మంది వేరేపని చేయలేక తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోనే ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి మేస్ర్తీలుగా వందలాది మంది, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి వేలాది మంది కూలీలుగా వలసవచ్చి నగరంలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేయగా ఆ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. రాష్ట్రం నుంచి వలసవచ్చిన కూలీలకు సరియైన వేతనా లు లభించనందున స్వతహాగా వారే రంగాన్ని మార్చుకోవడంతోపాటు బిల్డర్లు తక్కువ వేతనాలకు లభించే ఇతర రాష్ట్ర కూలీలవైపు మొగ్గుచూపడంతో నగరంలోని భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.బుట్టదాఖలైన చట్టాలు - అమలుకాని వేతనాలు....
అనురాధ (ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం - ఐఎఫ్‌టియు అనుబంధం)
ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పడడానికి ముందు కార్మికుల సంక్షే మం కోసం 200 కోట్ల రూపాయలు ఉండగా సభ్యత్వ నమోదు అయిన తర్వాత ఆ నిధులు 300 కోట్ల రూపాయలకు చేరినప్పటికీ అందులో నుంచి ఒక్క పైసా కూడా ప్రభు త్వం కార్మికుల సంక్షేమం కోసం కేటాయించ కపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుడుగా నమోదు చేసుకున్నవారికి ప్రమాదవశాత్తు మృతి చెందినవారి కుటుంబాలకు, శాశ్వత అంగవైకల్యం పొందినవారికి రెండు లక్షల రూపాయలు, ప్రమాదంలో 50 శాతం అంగవైకల్యం కలిగిన వారికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఉన్న నిబంధనలను ప్రభుత్వాలు, కార్మిక శాఖ తుంగలో తొక్కాయి, ఇప్పటివరకు ఏ ఒక్క కార్మికుడికి కూడా ఈ సదుపాయాలు అందలేదు.
కార్మికుల పట్ల నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్న ప్రభుత్వాలు....
మొరుగు యాదగిరి (ఆం.ప్ర.భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం)
ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి...
కామల్ల ఐలయ్య (భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
నారాయణగూడ సంఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఐదు లక్షల రూపాయలను కార్మిక శాఖ తన సంక్షేమ నిధి నుంచి రెండు లక్షల రూపాయలను నష్టపరిహారం చెల్లించి, మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కార్మిక శాఖ తమ సంక్షేమ నిధి నుంచి ప్రక టించిన రెండు లక్షల నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాము ప్రకటించుకున్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకుని నగరంలో విచ్చలవిడిగా నిర్మాణమవుతున్న అక్రమ కట్టడాల భరతం పట్టడానికి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
సంఘాలకు గుర్తింపు కార్డులివ్వాలి : ఉరిటి వెంకట్రావు
నారాయణగూడ దుర్ఘటనలో అసువులు బాసిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం కింద రెండు లక్షల రూపాయలను ప్రకటించిందని, ఇది ఎంతమాత్రం భావ్యం కాదని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉరిటి వెంకట్రావ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు నగరంలో కోకొల్లలుగా ఉన్నాయని, వీటిని అరికట్టాల్సిన అధికారులు అలసత్వం వహిస్తున్నందునే ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేగాక భవన నిర్మాణాల్లో యజమానులు, బిల్డర్లు రక్షణ చర్యలు చేపట్టక పోవడం కూడా ప్రమాదాలకు కారణమ వుతున్నాయన్నారు. అంతేగాక భవన నిర్మాణాల్లో కూలీలు ఏరోజు పని ఆరోజు వెతుక్కుంటూ అడ్డా కూలీలుగా జీవనం సాగించాల్సి వస్తోందని, వీరికి ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రాణాపాయం ఎదురైనా, గాయాలు సంభవించినా తగిన సాయం కోసం గుర్తింపు కార్డులెంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.అందుకే ఈ విషయంలో తాము కొద్ది కాలంగా ఈ విషయమై విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. అయితే తమ లాంటి కొన్ని గుర్తింపు పొందిన సంఘాలు, సంస్థల వారికి తగిన గుర్తింపు కార్డులను ప్రభుత్వం ఇస్తే ప్రమా దాలు జరిగినప్పుడు సహాయక చర్యలకు ఉపయోగ పడుతుందని ఉరిటి వెంకట్రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నారాయణగూడలో శుక్రవారం సహాయక చర్యలకు తాము వెళితే మీరెవరని ప్రశ్నించి దూరంగా పంపిం చే పరిస్థితి ఎదురైందని, అటువంటి పరిస్థితి ఎదురవకుండా గుర్తింపు కార్డులిస్తే తామూ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా శుక్రవారం ఘటనలో సహాయక చర్యలు చాలా ఆలస్యమయ్యాయని ఇటువంటి సందర్భాల్లో సత్వరమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ఇన్‌పుట్స్: ఈశ్వర్‌బాబు, సూర్యనారాయణ,
దుద్దాల రాజు, నర్సయ్య, హైదరాబాద్
- పర్యావరణ పరిరక్షణకు లక్ష మొక్కల నోము
- ప్రపంచ వేదికపై ‘ఐయామ్ కలాం’
- ఇంటిదవుతున్న సుస్మిత?
- స్వేద జలాలే క్షీర ధారలు
- కేక వీకెండ్ పార్టీలో హంగామా
- నవ్విన నాపచేనే పండింది
- లండన్ ప్రదర్శనకు భారత కళాకృతులు
- గురుదాస్మాన్కు యుకె గౌరవ డాక్టరేట్
- మంచుకొండల నుంచి... మనసుదోచేవరకు
- పాప్ మాంత్రికుడి ప్రపంచ రికార్డు
- కలనిజమైంది


























































