Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Tollywood >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
వెండితెర అమ్మ

Nirmalama-Condolenceప్రముఖనటి నిర్మలమ్మ తల్లి పాత్రలకు, బామ్మ పాత్రలకు పెట్టింది పేరు. ఆమెను చూస్తే అచ్చం మన బామ్మను చూసినట్టే ఉంటుంది. అది ఇప్పటివారికి. ఓ ముఫై ఏళ్ల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెడితే నిర్మలమ్మ నిజంగా అమ్మే. సినిమా అమ్మ. ఆమె అమ్మ పాత్రలెన్నో పోషించి మెప్పించింది. చిత్రమేమిటంటే నిర్మలమ్మ తన కంటే పెద్దవారైన అక్కినేనికి, ఎన్టీ రామారావుకు, ఎస్వీ రంగారావుకు కూడా అమ్మగా నటించారు. నిర్మలమ్మ సినిమాల్లోకి రాకముందు కాకినాడలో నాటకాలు వేశారు. ఆమె వేసిన నాటకాలు ‘కరువు రోజులు’, ‘ఏకవీర’ మహామహులైన పృథ్వీరాజ్‌ కపూర్‌, విశ్వనాథ సత్యనారాయణల ప్రశంసలు పొందాయి. నిర్మలమ్మ మూడు మీడియాల నటి. మొదట రంగస్థలంపై నాటకాలు వేసిన నిర్మల ఆ తర్వాత రేడియో నాటకాల్లో నటించింది. అటుపిమ్మట సినిమాల్లోకి వచ్చింది.

సినిమాల్లో అమ్మ పాత్రల్ని రక్తి కట్టించిన ఘనత నిర్మలదే అనాలి. తల్లి పాత్రను ఆమె చాలా సహజంగా, అలవోకగా పోషించింది. ‘మనుషులు మారాలి’ ఆవిడకు ఎంతో పేరు తెచ్చిన చిత్రం. ఆ సినిమాలో ఆమె పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ విలన్‌ ప్రాణ్‌ కూడా మెచ్చుకున్నారు. తల్లి పాత్రల్లో నటించడంలో ఆమెకు తనదైన ఓ ప్రత్యేక శైలి ఉండేది. ఏ సినిమాలో అయినా ఆమె వస్తధ్రారణ చాలా సాదాసీదాగా నిజంగా మన అమ్మ కట్టుకునే బట్టలమాదిరే ఉండేది. ఓ మామూలు తెల్ల చీరే లేదా చిన్న బార్డరున్న నీరుకావి చీర కట్టుకుంటే చాలు ఆమెకు ఇంక మేకప్‌ అవసరమయ్యేది కాదు. ఏ పాత్రనైనా చాలా సులభంగా నటించడం నిర్మలమ్మ ప్రత్యేకత. ఆమె చాలా సులభంగా భావప్రకటన చేసేది.

‘శంకరాభరణం’లో చంద్రమోహన్‌ బామ్మగా నటించి ఇప్పటికీ గుర్తుండిపోయారు. నిర్మలమ్మ తల్లి పాత్రలే కాదు, కామెడీ పాత్రలూ చేశారు. వంశీ చిత్రం ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’లో హీరోయిన్‌కు బామ్మగా చేశారు. ఇందులో కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ ఉన్న సన్నివేశాలు భలే నవ్విస్తాయి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన చిత్రంలో కూడా నిర్మలమ్మ పాత్ర మనకు గుర్తుండిపోతుంది. ఇక చిరంజీవి సినిమా ‘గ్యాంగ్‌ లీడర్‌’లో చిరంజీవి తాత మనవడిగా ద్విపాత్రాభినయం చేశారు.

తాత పాత్ర అంటే నిర్మల వాళ్లాయనన్నమాట. మనవడిని తిట్టిన్నప్పుడల్లా ఫోటో ఫ్రేంలోంచి తాత చిరంజీవి వెంటనే కదిలివచ్చి నిర్మలను మందలిస్తుంటాడు. ఇది కూడా మనకు నవ్వు తెప్పించే సన్నివేశమే. ఈ సినిమాలు మెచ్చుతునలు మాత్రమే. ఇవివి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి కామెడీ దర్శకుల చిత్రాల్లో నిర్మలమ్మ నటించారు. ఈ చిత్రాల్లో ఆమె ఎక్కువగా చంద్రమోహన్‌, రాజేంద్రప్రసాద్‌లకు బామ్మగా నటించారు. ‘స్వాతిముత్యం’ చిత్రంలో కమల్‌హాసన్‌ తల్లిగా కంట తడిపెట్టించిన దృశ్యాలు మరచిపోలేము. తెలుగువారు నాలుగు కాలాలపాటు గుర్తుంచుకునే నటి నిర్మల గత సంవత్సరం ఇదే రోజున కన్నుమూశారు.

Other News From Tollywood
SURYA Specials |
Weekly Specials |
Advertisement400
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us